అసలే ఓటిటిల దెబ్బకి సింగిల్ స్క్రీన్లు దాదాపుగా అడుక్కుతింటున్నాయి. మెగస్టార్ తర్వాత ధియేటర్లకి జనాలని పరిగెత్తించే మొనగాడే లేడు. ఓ ముగ్గురో నలుగురో ఉన్నా వాళ్ళు మూడేళ్ళకో సినిమాతో ప్రత్యక్షమవుతున్నారు. ఈ లోగా సింగిల్ స్క్రీన్లు ఈగలు తోలుకోవడమే. ఏ యంగ్ హీరో సినిమాని చూడ్డానికి జనం పెద్ద ఆసక్తి చూపించడం లేదు.
చిత్రపరిశ్రమలో మళ్ళీ మరో స్తంభన ఏర్పడింది. ఇక్కడ ఒకరి మాట ఒకరికి పొందదు. ఏ ఇద్దరి మధ్యన పొంతన ఉండదు. ఎవరి పబ్బం వారు గడుపుకునే ఒక సమీకృత పరిశ్రమ ఇది. ఒకడు చచ్చిపోతున్నా మరొకడికి పట్టదు. పూర్వం ఉన్న విధానాలు పూర్తిగా మారిపోయాయి. వ్యాపారంలో కానివ్వండి, వ్యవహారాల్లో కానివ్వండి. ఎప్పుడైతే ఏరియా వైజ్ అమ్మకాలు, స్లాబ్ సిస్టమ్ వచ్చిందో అప్పుడే పరిశ్రమకి గడ్డు పరిస్థితి మొదలైపోయింది. కాకపోతే అది పూర్తిగా ముదిరి ఈ రోజున ధియేటర్లే మూసి వేస్తామన్న దిక్కుమాలిన పరిస్థితి దాపురించింది. ఇది నిజానికి తెలుగు చిత్రపరిశ్రమకి మామ్మూలు తలవంపులు కాదు. ఓ పక్కన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానే తెలుగు సినిమాలంటే చేతులెత్తి దండం పెట్టే పరిస్థితి నెలకొని ఉండగా, తెలంగాణ, అంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు మూసుకుంటామని ఎగ్జిబిటార్లు బోరుమంటున్నారంటే ఇంతకన్నా తెలుగు చిత్ర పరిశ్రమకి అధోగతి ఉండదు.
దీనికి కారణం ఎవరు? తిలాపాపం తలా పిడికెడు. ఎవరి స్వార్థం వారు మానుకోరు. ఎవరి లబ్ధిని ఎవరూ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. చివరికి బలైపోతున్నది సింగిల్ స్క్రీన్ ధియేటర్ల యజమానులే. కార్పొరేట్ స్టేటస్ సాధించుకున్న మల్టీప్లెక్సులు .దౌర్జన్యంగా అత్యంత అధికంగా పర్సంటేజ్‌లు లాక్కుంటుంటే, సింగిల్ స్క్రీన్లు మాత్రం బిచ్చమెత్తుకుంటున్నట్టుగా ఉంది పరిస్థితి. పదో పదిహేనో పర్సంటేజ్ వస్తే చాలు అదే పదివేలు అన్నట్టుగా అయికూర్చుంది పరిస్థితి. మళ్ళీ బడాబాబులందరకీ సింగిల్ స్క్రన్లు కోకొల్లలుగా ఉన్నాయి. అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టలో చేపలు మాత్రం మాయం అన్నట్టుగా ఉందిప్పుడు. అసలే ఓటిటిల దెబ్బకి సింగిల్ స్క్రీన్లు దాదాపుగా అడుక్కుతింటున్నాయి. మెగస్టార్ తర్వాత ధియేటర్లకి జనాలని పరిగెత్తించే మొనగాడే లేడు. ఓ ముగ్గురో నలుగురో ఉన్నా వాళ్ళు మూడేళ్ళకో సినిమాతో ప్రత్యక్షమవుతున్నారు. ఈ లోగా సింగిల్ స్క్రీన్లు ఈగలు తోలుకోవడమే. ఏ యంగ్ హీరో సినిమాని చూడ్డానికి జనం పెద్ద ఆసక్తి చూపించడం లేదు. మాడు పగలగొట్టని సినిమాయే లేదు. ఈ మధ్యరోజుల్లోనే దాదాపుగా వెయ్యికోట్లు స్వాహా అయిపోయాయి. నిర్మాతలు పాపం చేస్తున్నారు. కష్టమో నష్టమో కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. కానీ మహానుబావులు ఒక్కడి సినిమా చూడ్డానికి కూడా ముందుకు రావడం లేదు. దరిమిలా ఇటు నిర్మాతలకి, అటు ఎగ్జిటార్లకి కూడా దెబ్బ పడిపోతోంది. ధియేర్లని మెంటైన్ చేయడమే బ్రహ్మప్రళయం అయిపోతోంది.
ఈ ఎడారిలో ధియేటర్లను నడపడం ఆత్మహత్యసదృశమని తేల్చుకుని సింగిల్ స్క్రీన్ యజమానలు ఒక తాటి మీదకి వచ్చి ఇంక ఈ ఛావు మేం చావలేమని తేల్చిచెప్పి,జూన్ ఒకటో తేదీనుంచి ధియేటర్ల క్లోజర్ ఏకపక్షంగా ప్రకటించగానే అప్పుడు సినిమా పెద్దల వెన్నులో చలిపుట్టింది. మల్టీ ప్లెక్సుల్లాగు తమకి కూడా హేండ్సమ్ పర్సంటేజ్ ఇవ్వాలని, ఈ అడుక్కునే పని ఇంక చేయలేమని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. దాంతో పెద్దలు సురేష్‌బాబు, దిల్‌రాజు వగైరా రంగంలోకి దిగి వారిని బుజ్జగించి రేపు ఇరవైనాలుగు తారీఖ వరకూ ఓపిక పట్టమని ఊరడించారు. అయితే, సినిమా అడినా ఆడకపోయినా కూడా వారంవారం రెండు ఐదేసి లక్షలు కడుతున్నాం కదా అనే నిర్మాతల వాదన కూడా ఉంది. కానీ వస్తున్న ఈ ఘోరమైన కళాఖండాలు ఒక వారం కూడా ఆడని పరిస్థితిలో ఎందుకొచ్చిన ఈ రెంటులు అనే అశనిపాతానికి ధియేటర్లు వచ్చేశాయి.
కాకపోతే ఇప్పుడు కొందరు నిర్మాతలు, పంపిణీదారులు కూడా ఎగ్జిబిటర్ల మొరని తలకెక్కించుకుని వారి తరుఫున నిలబడడానికి సుముఖంగా ఉన్నారు, నడుం కట్టబోతున్నారని కొందరు చెబుతున్నారు. ఏదైనా ఏం జరుగుతుందన్నది ఒక్క రోజు నిరీక్షించి చూడాల్సిందే.