దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్బంగా ఇంద్రకీలాద్రి(Indrakiladri)కి భక్తులు పోటెత్తారు. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. సరస్వతీ దేవి (Saraswati devi) అలంకారంలో భక్తులకు దర్శించే అమ్మవారి కృపాకటాక్షాల కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ (Kanakadurgamma) 5వ రోజున నిజ ఆశ్వయుజ శుద్ధ సప్తమి శుక్రవారంనాడు సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు.
త్రిశక్తి స్వరూపిణీ నిజ స్వరూపాన్ని సాక్షత్కారింపజేస్తూ శ్వేతపద్మాన్ని అధిష్టించిన దుర్గామాత తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయములతో సరస్వతీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు అమ్మవారికి గారెలు, పూర్ణాలు నైవేధ్యంగా సమర్పిస్తారు. క్యూలైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్ట్మెంట్లను పోలీసులు (Police) ఏర్పాటు చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని సీపీ కాంతిరాణా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. రోప్లతో భక్తులను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. ఇవాళ సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. నేడు సీఎం జగన్ (CM Jagan) ఇంద్రకీలాద్రికి రానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో మరింత భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు