వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లు వరుసగా ప్రమాదాల (Accidents) బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఎద్దులు, ఆవులు ఢీకొనడంతో రైళ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తాజాగా ఈ రైలు వలన ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి (Railway Retired Employee) మరణించాడు. అయితే ఆ సంఘటన జరిగిన తీరు చూస్తే విస్మయానికి గురవుతారు. మొదట రైలు జింకను (Deer) ఢీకొట్టింది. అతి వేగంతో రైలు ఢీకొనడంతో ఆ జింక ఎగిరి విశ్రాంతి రైల్వే ఉద్యోగిపై పడింది. ఆయన తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ సంఘటన రాజస్థాన్ (Rajasthan)లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ (New Delhi) నుంచి రాజస్థాన్ లోని అజ్మీర్ (Ajmeer)కు వందే భారత్ రైలు బుధవారం వెళ్తోంది. అల్వార్ (Alwar)లోని కలిమోరి రైల్వే లెవర్ క్రాసింగ్ (Kali Mori Railway Crossing) వద్దకు చేరుకోగానే ఓ జింక అటువైపుగా వస్తోంది. రైలు ఆ జింకను ఢీకొట్టింది. వేగంతో ఢీకొట్టడంతో జింక ఎగిరి అటువైపు వెళ్తున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి శివదయాళ్ పై పడింది. జింక ధాటికి శివదయాళ్ కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా స్థలంలోనే జింకతోపాటు అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి (Rajiv Gandhi General Hospital) తరలించారు. కాగా మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. వందే భారత్ రైలు ఢీకొని పశువులు మృతి చెందుతున్నాయి. గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతంలో పట్టాలు దాటుతున్న 54 ఏళ్ల మహిళను వందే భారత్ ఢీకొట్టింది. ఈ సంఘటన గతేడాది నవంబర్ లో జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా పలుచోట్ల వందే భారత్ రైలు పట్టాలపైకి పశువులు రాకుండా రక్షణ గోడలు నిర్మించారు.