ఒడిశాలో క్రికెట్ ఓ ప్రాణాన్ని తీసింది. అంపైర్ గా వ్యవహరిస్తున్న ఇరవై రెండేళ్ల లక్కీ రౌత్ కి, ఆటగాడు జగారౌత్ కు మధ్య నో-బాల్ విషయమై వివాదం ప్రారంభమై, చినికి చినికి వానగా మారి అది కత్తితో పొడిచి ప్రాణం తీసే వరకు పోయింది.
అప్పటి వరకు ఆనందంగా ఆడిన క్రికెట్ లో (Cricket) తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. క్రికెట్ ఆట హద్దులు దాటి, ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఆటగాళ్లు ఓ అంపైర్ పైన దాడి చేసి, ప్రాణాలు పోయేలా కొట్టారు (Umpire stabbed to death). కత్తితోను దాడి చేశారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని (Odisha) కటక్ లో జరిగింది. ఇంతకు ఆ అంపైర్ చేసిన తప్పేమిటో తెలుసా… కేవలం నో-బాల్ ఇవ్వడం. కటక్ జిల్లాలోని మహిషాలాండ్ లో చౌద్ వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నాడు ఈ విషాదం చోటు చేసుకోగా, మృతుడిని లక్కీ రౌత్ గా గుర్తించారు. శంకాపూర్, బెర్హాపూర్ ప్రాంతాలకు చెందిన రెండు యువ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో అంపైర్ గా వ్యవహరిస్తున్న ఇరవై రెండేళ్ల లక్కీ రౌత్ కి, ఆటగాడు జగారౌత్ కు మధ్య నో-బాల్ విషయమై వివాదం ప్రారంభమైంది. ఈ వివాదం కాస్త పెరిగింది. జగారౌత్ తన సోదరుడు మునారౌత్ ను పిలిపించాడు. అక్కడకు చేరుకున్న ఆ సోదరుడు… అంపైర్ పైన బ్యాట్ తో కొట్టాడు. ఆ తర్వాత కత్తితో దాడి చేశాడు. చాతి, పొట్టలో కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీప హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి సమ్రిత రంజన్ రౌత్, జగా రౌత్, సంజయ్ రౌత్, బాదల్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను విచారిస్తున్నారు. కీలక నిందితుడు మునా పరారీలో ఉన్నాడు.