ప్రేమ కోసం ఎంతటి సాహసమైనా చేయాలని అనిపిస్తుంది. ఇక మనసుకు నచ్చిన వాళ్లు చెబితే ఎంతటి పనులనైనా చేయడానికి వెనుకాడం. ఇక అమ్మాయి కోరితే అరక్షణంలో తీసుకుని ఇచ్చే ప్రియులు కూడా ఉంటారు. అట్లాంటి వ్యక్తే మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు. ప్రేయసి కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ప్రేయసి కోరిందల్లా తీసుకొచ్చి ఇచ్చేందుకు బైక్ దొంగతనాలు చేసి వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో ఆమె కోరికలన్నీ తీర్చాడు. అయితే వరుస దొంగతనాలపై కన్నేసిన పోలీసులు ఆ యువకుడి ఆట కట్టించారు. ఇప్పుడు ఆ యువకుడు తన విలువైన జీవితాన్ని జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
డీసీపీ సచిన్ గుంజాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర థానే జిల్లాలోని కల్యాణ్ అనే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు శుభం భాస్కర్ పవార్. అతడికి ఓ యువతి పరిచయమైంది. ఆమెను మచ్చిక చేసుకునేందుకు.. ఆమె తన వెంట తిరిగేందుకు శుభం భాస్కర్ ఖరీదైన బైక్ లను దొంగతనం చేయడం ప్రారంభించాడు. లాథూర్, సోలాపూర్, పుణె తదితర ప్రాంతాల్లో ఇలా ఏకంగా 13 ఖరీదైన బైక్ లను దొంగిలించాడు. రోజుకో బైక్ లో ఆ యువతితో షికారు చేసేవాడు. ఆ బైక్ ల విలువ ఏకంగా రూ.16.05 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాల తనిఖీ సమయంలో ఆ యువకుడు దొరికాడు. విచారణ చేయగా అతడు చేసిన దొంగతనాల చిట్టా బహిర్గతమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.