మంచి ఉద్యోగం.. అందమైన భార్య. పెళ్లయి ఆర్నెళ్లు దాటింది. మిగతా అన్ని పనులు చూసుకుని తీరిగ్గా హనీమూన్ కు వెళ్దామని పక్కాగా ప్రణాళిక వేసుకున్నాడు. మలేసియాలో జాలీగా గడిపి వద్దామని ఆ యువకుడు కలలు గన్నాడు. అనుకున్నట్టే హనీమూన్ కోసం మలేసియా వెళ్లాడు. బాలీలో భార్యతో కలిసి సరదాగా తిరుగుతుండగా విధి కాటేసింది. రాకాసి సముద్రం అతడిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో ఆశలతో వెళ్లిన ఆ యువకుడు శవమై హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని నాగోల్ లో విషాదం నింపింది.
వివరాలు ఇలా ఉన్నాయి.. నాగోల్ లోని బండ్లగూడలో నివసించే రాముని రవీందర్ కుమారుడు వంశీకృష్ణ (27) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. గతేడాది జూన్ 23వ తేదీన కర్మన్ ఘాట్ కు చెందిన యువతితో వివాహమైంది. ఈనెల 13న భార్యతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు హనీమూన్ కోసం వెళ్లాడు. మలేసియా యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఇండోనేసియాలోని బాలీకి వెళ్లారు. ఈనెల 22న ఆదివారం వంశీకృష్ణ బాలీలోని సముద్ర గర్భంలో ఉన్న ఆక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. అన్నీ జాగ్రత్తలు తీసుకుని సముద్రంలోకి వెళ్లగా వంశీకృష్ణ అకస్మాత్తుగా గల్లంతయ్యాడు.
భర్త ఎంతసేపటికి రాకపోవడంతో అతడి భార్య అక్కడి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సముద్రంలో గాలించగా వంశీకృష్ణ శవమై తేలాడు. బాలీలో పోస్టుమార్టం చేసిన అనంతరం శుక్రవారం హైదరాబాద్ కు బాడీ తీసుకురానున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో వంశీకృష్ణ ప్రతిభ కనబర్చి మెయిన్స్ కు అర్హత సాధించడం విశేషం. మెయిన్స్ లో కూడా సత్తా చాటి ప్రభుత్వ అధికారి అవుతాడనుకుంటే శవమయ్యాడని కుటుంబసభ్యులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఎన్నో కలలతో వెళ్లిన తమ పిల్లాడు శవమై వస్తుండడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.