IPL2024: ఐపీఎల్ సీజన్ మొదలైంది అంటే అందిరికీ మ్యాచ్ చూడాలనే ఉత్సాహం ఉంటుంది. అందుకోసం ఆన్లైన్లో, ఆఫ్ లైన్లలో పడిగాపులు గాస్తుంటారు చాలా మంది క్రికెట్ అభిమానులు. తాజాగా టికెట్లు దొరకడం లేదని కొంత మంది విద్యార్థి సంఘం నాయకులు ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. టికెట్లు అమ్మకంలో పారదర్శకత లేదంటూ బీసీసీ సీఈఓను కలవడానికి వచ్చారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు అధికారులు బ్లాక్ టికెట్ వ్యవహారం ఒకటి ఛేదించారు. అధిక ధరకు విక్రయిస్తున్న సాప్ట్వేర్ ఇంజినీర్‌ను ఆయనకు సహయపడే మరికొందరిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన బెంగళూరుకు చెందిన చిత్తూరు రమణ, హైదరాబాద్‌కు చెందిన శామ్యూల్ సుశీల్ స్నేహితులు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని డబ్బు సంపాదించాలి అని భావించారు. టికెట్లు ఆన్లైన్లో పెట్టగానే ఇతరుల ఐడీలతో భారీగా టికెట్లు కొనుగోలు చేస్తారు. వాటిని తెలిసిన వాళ్ల ద్వారా మార్కెట్ చేసుకొని డిమాండ్‌ను బట్టి అమ్ముతుంటారు. ఆటను బట్టి డిమాండ్ భారీగా ఉంటుంది. ఒక్కో టికెట్ రూ. 20 వేలకు అమ్మినా ఆశ్చర్యం లేదని తెలుస్తుంది. ఇక వీరి నుంచి 100 టికెట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్లాక్ దందాపై పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తుంది.