కెమికల్ ఫ్యాక్టరీ (Chemical Factory)లో భారీ పేలుడు సంభవించడం వల్ల ఏడుగురు కార్మికులు మృతిచెందారు. మంటల్లో కాలి కార్మికులు సజీవ దహనం అయిన ఘటన గుజరాత్ లోని సూరత్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 27 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఏథర్ ఇండస్ట్రీస్‌లోని కెమికల్ స్టోరేజీ ట్యాంకులో మంటలు చెలరేగడంతో ఈ దారుణం జరిగింది. భారీ పేలుడు వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.
ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. మరికొందరు మంటల నుంచి తప్పించుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. గురువారం ఉదయం ఏడుగురు కార్మికులు కాలి బూడిదగా మారినట్లు అధికారులు గుర్తించారు.
అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన కంపెనీ ఓ ప్రముఖ వ్యక్తిది కావడంతో ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ లోని బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరైన అశ్విన్ దేశాయ్‌కు చెందిన కెమికల్ ఫ్యాక్టరీలోనే ఈ ప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.