రష్యా(Russia)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డగేస్టాన్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో భారీ పేలుడు (Explosion) సంభవించడంతో 25 మంది దుర్మరణం (25 died) చెందారు. ఈ ఘటనలో 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. డగెస్టాన్లోని మఖ్చఖ్లా అనే ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. పెట్రోల్ బంక్‌లోని కార్ సర్వీస్ స్టేషన్లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. చాలా సేపటి తర్వాత మంటలను అదుపు చేయశారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియలేదు. ఘటనపై దర్యాప్తు చేపడతామని అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని మాస్కో(Masco)కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కార్లు పార్కు చేసిన ప్రాంతంలో మొదటగా మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఆ మంటలు పెట్రోల్ స్టేషన్ (Petrol station)కి చేరి భారీ పేలుడు సంభవించిందన్నారు. భార శబ్దం వల్ల స్థానికులు భయాందోళన చెందారు. ఈ పేలుడు వల్ల పక్కనే ఉన్న భవనానికి సైతం నిప్పులు అంటుకోగా ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. 600 స్వ్కేర్ మీటర్ల వరకూ మంటలు వ్యాపించగా 260 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.