PM Modi : రష్యాకు నేను 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చాను : ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాకు తాను ఒక్కడినే రాలేదని... 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చానని తెలిపారు.
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాకు తాను ఒక్కడినే రాలేదని… 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చానని తెలిపారు. భారతదేశ మట్టి వాసనను తన వెంట తీసుకొచ్చానని ఎమోషనల్ అయ్యారు. భారతదేశం-రష్యా మధ్య బంధాన్ని.. సాంస్కృతిక సంబంధాలను కొనియాడారు. భారత్ రష్యా మధ్య బలమైన బంధాన్ని పెంపొందించడంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. తాను ఇటీవలే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశానని, ఇక నుంచి మూడు రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారత్ ను ఇప్పటికే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని, దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ ముందున్న లక్ష్యమని మోదీ మరోసారి స్పష్టం చేశారు.
మోదీ మాట్లాడుతూ.. “రష్యా భారతదేశానికి స్నేహితుడు. మా స్నేహం పరస్పర విశ్వాసం, గౌరవం మీద ఆధారపడి ఉంది. ప్రపంచ శ్రేయస్సుకు కొత్త శక్తిని అందించడానికి భారతదేశం రష్యాలు చేయి చేయి కలిపి పనిచేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. రష్యా అనే పదం వినగానే, ప్రతి భారతీయుడి మనస్సులో మొదట వచ్చేది భారత భాగస్వామి. రష్యాలో చలికాలంలో ఉష్ణోగ్రత ఎంత మైనస్‌కు తగ్గినప్పటికీ, భారత్ – రష్యా స్నేహం ఎప్పుడూ ప్లస్‌లో ఉంటుంది”అని మోదీ అన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందిందని, మనం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. మరే దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేశామని, డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉందని వివరించారు. అధ్యక్షుడు పుతిన్ రెండు దశాబ్దాలకు పైగా రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అద్భుతంగా కృషి చేశారు. గత 10 ఏళ్లలో నేను రష్యాకు రావడం ఇది ఆరోసారి. ఈ సంవత్సరాల్లో ఇద్దరం 17 సార్లు కలుసుకున్నాం. మూడో సారి ప్రధాని అయిన తర్వాత తన మొదటి ప్రవాస కార్యక్రమం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.