RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జల వనరుల సంరక్షణపై కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. వాటర్ మేనేజ్‌మెంట్‌పై కార్పొరేషన్ అధికారులు, రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా పని చేయనున్నారు. చెరువులు, నాలాల ఆక్రమణలపై వచ్చే ఫిర్యాదులను హైడ్రా స్వీకరించి వెంటనే చర్యలు తీసుకుంటుంది. జల వనరుల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నారు.
MNCL: జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అడిషనల్ GM (E&M) శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సోలార్ ఎనర్జీ, కార్పొరేట్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం సోలార్ ఎనర్జీ (E&M) GMగా విధులు నిర్వర్తిస్తున్న సీతారామం ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో శ్రీనివాస్‌ను నియమించారు.
KMM: పండగ వాతావరణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ గ్రామసభ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామసభ నిర్వహణపై జిల్లా కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్‌లు డాక్టర్ పి శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు.
GDWL: గద్వాల జిల్లా సమీపంలోని జమ్మిచెడులో వెలిసిన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణానది జలాలతో అభిషేకం, ఆకు పూజ, హోమం తదితర కార్యక్రమాలు జరిపించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు.
MDCL: కీసర పరిసర ప్రాంతాల్లో క్రషర్ గుంతలు తీవ్ర సమస్యగా మారాయి. అనేక ప్రాంతాల్లో గుంతలు నీటితో నిండి ప్రమాదకరంగా మారుతున్నాయి. సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో స్థానికులకు ప్రమాదం ఏర్పడుతోంది. అధికారులు వెంటనే స్పందించి, గుంతలను పూడ్చడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం అవసరమని, ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
HYD: సనత్‌నగర్ TIMS ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం, సౌకర్యాల విస్తరణకు చర్యలు చేపట్టారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల కుటుంబ సభ్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 200 పడకలతో ధర్మశాల ఏర్పాటు చేయనున్నారు. ఈ ధర్మశాలలో విశ్రాంతి, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించబడనున్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉపశమనం లభించనుంది.
PDPL: పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. 45 సంవత్సరాల ఓ మహిళకు గర్భాశయంలోని పెద్ద గడ్డను అధునాతన ఆపరేషన్ ద్వారా విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు.
HNK: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పగడాల కాళీప్రసాద్ రావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు నియమించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాళీప్రసాద్ రావు బరిలో నిలిచారు. కాళీప్రసాద్ రావుకు ఎగ్జిక్యూటివ్ నెంబర్‌గా అవకాశం కల్పించడం పట్ల నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
KNR: వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన కనకంటి మణెమ్మ (74) శ్రీరామనవమి వేడుకల కోసం ఆసిఫాబాద్ వెళ్లగా, అక్కడ అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
BDK: ఆదాయం గోరంత, ఖర్చు కొండంత అన్నట్టు కొత్తగూడెం కార్పొరేషన్ తొలి బడ్జెట్ ఉందని మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి విమర్శించారు. మేయర్ గణేష్ అధ్యక్షతన రోజు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 140 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి మాత్రమే అని తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్‌కు రూ. 33 కోట్ల ఆదాయం ఉంటే 107 కోట్ల ఆదాయం ఎలా వస్తుందని అన్నారు.
WNP: హెచ్పీవీ వ్యాక్సినేషన్‌తో మహిళలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. రేవల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఉన్న 14 ఏళ్ల పైబడిన 29 మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ చేశారు. బాలికలకు తల్లిదండ్రుల ఆమోదంతో ఉచితంగా వేసినట్లు తెలిపారు.
NZB: దేశ ఆర్థిక రాజధాని ముంబయికి ఉపాధి వెతుక్కుంటూ ఉమ్మడి జిల్లా నుంచి ఎంతోమంది వలస వెళ్లారు. గల్ఫ్ తర్వాత అత్యధిక మంది ఆశ్రయించేది పొరుగు రాష్ట్రంలోని మహానగరాన్నే కావడం విశేషం. వీరితో పాటు ఉన్నత విద్య కోసం, పర్యాటక యాత్రలకు ఏటా వేలాది మంది తరలివెళ్తున్నా నిజామాబాద్ రైల్వే జంక్షన్ నుంచి ఇప్పటికీ కనీస రైలు సదుపాయాల్లేకపోవడం గమనార్హం.
SRPT: మూడు మండలాలను కలిపే ప్రధాన వారధి అయిన అర్పపల్లి- కొమ్మాల బీటీ రోడ్డు ప్రస్తుతం అధ్వాన స్థితికి చేరుకుంది. అర్పపల్లి, కాసర్లపహాడ్ సమీపంలో రహదారిపై బీటీ పొర పూర్తిగా లేచిపోయి, కంకర తేలి భారీ గుంతలు ఏర్పడ్డాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన బీటీ పునరుద్ధరణ పనులు చేపట్టి, తమ ప్రయాణ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
SDPT: బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సోమవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్య క్రమానికి బెజ్జంకి బాయ్స్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులు శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ఇటువంటి పోటీలు విద్యార్థుల మేధస్సును పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన కొనియాడారు.