BDK: ఇల్లందు 21 ఏరియాలోని విజయలక్ష్మి నగర్ నివాసితులకు సింగరేణి యాజమాన్యం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై అఖిలపక్ష నాయకులు అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలుగా నివసిస్తున్న తమకు నష్టపరిహారం చెల్లించకుండా ఇళ్లు ఖాళీ చేయాలని వేధించడం సరికాదన్నారు. ప్రజావాణిలో మొరపెట్టుకున్న తమకు ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని వారు కోరారు.
JGL: కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక కట్టడమైన గడి బురుజు స్థలం, వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతూ కలెక్టర్‌కు అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా నాయకులు మట్లాడుతూ.. గడి బురుజు చుట్టుపక్కల గల ఖాళీ స్థలాలను భూ బకాసురులు నకిలీ దస్తావేజులు తయారు చేస్తున్నారని అన్నారు.
SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 8 -23 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ ప్రకటించారు. ఈ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. అత్యవసరమైతే ఏసీపీ అనుమతి తప్పనిసరి అని వెల్లడించారు. ముఖ్యంగా డీజేల వినియోగంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
SRD: రహదారుల నిర్మాణం ద్వారా ప్రజల రవాణా సౌకర్యం మెరుగవుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 3 కోట్ల 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, బీటీీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 8 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించి చట్టపరమైన సాయం పొందాలని ఆయన సూచించారు.
MDK: తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద సోమవారం సాయంత్రం పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 300 క్వింటాళ్ల బియ్యాన్ని ఎస్సై గంగరాజు బృందం స్వాధీనం చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న ఈ నిల్వలను పట్టుకుని, లారీని స్టేషన్‌కు తరలించారు.
JGL: కోరుట్ల పట్టణంలో సబ్సిడి గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి, వినియోగిస్తున్న పలు హోటళ్ళు, టిఫిన్ సెంటర్లలో సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న 48 సబ్సిడి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
NRPT: ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామ సమస్యలను సర్పంచ్ వాకిటి వెంకటేశ్ సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, ఈ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.
GDWL:ప్రపంచ వినాశనానికి దారితీసే యుద్ధాలను ఆపి, శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి” అని గద్వాల అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు యుద్ధ వ్యతిరేక శాంతి ర్యాలీ నిర్వహించారు. వెంకట్రాములు మాట్లాడుతూ.. యుద్ధాల వల్ల ఆర్థిక, సామాజిక వ్యవస్థలు కుప్పకూలి ఆకలి, పేదరికం పెరుగుతాయి అన్నారు.
HNK: జిల్లాకు సంబంధించిన EVMలను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూముల నుంచి పటిష్ట భద్రత మధ్య మంగళవారం కొత్త గోడౌన్‌కు తరలించనున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చి పరిశీలించాలని కోరారు. గోడౌన్‌లో CCTV ఫైర్ ప్రొటెక్షన్ వంటి అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తిగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
NLG: నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు ఆలయ గుట్టపై నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయిస్తున్న షాపును ఆలయ ఈఓ మోహన్ బాబు సీజ్ చేశారు. భక్తుల ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టగా, ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ఉన్న నకిలీ వాటర్ బాటిల్స్‌ను భారీగా గుర్తించారు. టెండర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు సదరు నిర్వాహకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
NZB: 18 ఏళ్ల లోపు మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం చట్టరీత్యా నేరమని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు హెచ్చరించారు. సాలూరలోని కిరాణా దుకాణాల వద్ద ఆయన పోలీసు సిబ్బందితో కలిసి అవగాహన పోస్టర్లను అంటించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా నిషేధిత హెచ్చరిక బోర్డులు ఉండాలని స్పష్టం చేశారు.
KMR: ఆర్థిక పునరావాస పథకం కింద జిల్లాలోని ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ.75,000 చొప్పున మంజూరైన ఈ సాయం తమకు ఎంతో బలం చేకూరుస్తుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల, సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్ పాల్గొన్నారు.
PDPL: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు.
MHBD: పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి గ్రామపంచాయతీ భవనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలను సులభంగా అందించేందుకు ఈ భవనం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.