KMR: మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్థులో ఉదయం 11:30 గంటలకు శనగ కొనుగోలు కేంద్రంను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభిస్తారని సొసైటీ కార్యదర్శి రెంజర్ల గంగాధర్ తెలిపారు. ప్రభుత్వ ధర రూ.5,875 ధర ఉందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
NLG: దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో శుక్రవారం ఆర్థిక ఇబ్బందులతో వ్యవసాయ కూలీ తిరుపతి (45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తిరుపతి కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
KMM: జిల్లాలో 9 ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన మెటీరియల్తో అత్యుత్తమ డిజైన్లు రూపొందించాలని అన్నారు. నాబార్డ్ నిధులతో జీ+1 పద్ధతిలో తరగతి గదులు, ల్యాబ్స్, డైనింగ్ హాల్స్ వంటి అత్యాధునిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
SDPT: కొండపాక మండలం జప్తినాచారం గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ పావని, యువత, గ్రామస్థుల సహకారంతో ఆలయ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఆలయ కమిటీ ఛైర్మన్ వడ్లకొండ మల్లేశం గౌడ్ హామీ ఇచ్చారు. కార్యక్రమమంలో వైస్ ఛైర్మన్ గా సదన్ రెడ్డితోపాటు సభ్యులు పాల్గొన్నారు.
MBNR: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ జానకి ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉపవాస దీక్షల ద్వారా పొందే ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
MDCL: జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ల పరిధిలో సుమారు రూ.33 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నిర్మాణాల ఆధారంగా ఆస్తి పన్ను పరిధిని విస్తరించడంతో పాటు, కొత్తగా జారీ చేసే నిర్మాణ అనుమతులన్నింటినీ అధికారిక యంత్రాంగం సమగ్రంగా అంచనా వేసింది. 3 కార్పొరేషన్లలో పన్ను వసూళ్లను పెంచడంపై దృష్టి సారించారు.
VKB: రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో పాటు సోదరభావంతో జరుపుకోవాలని ధారూర్ ఎస్సై రాఘవేందర్ ప్రజలను కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడుతూ మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించాలని తెలిపారు. ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
RR: రంజాన్ వేడుకను శాంతియుతంగా జరుపుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకను నిర్వహించాలని కోరారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
NRPT: మద్దూర్ మండలం బండగోండలో జరిగిన బీపీఎల్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన బండగోండ జట్టు సభ్యులు తమ ఉదారతను చాటుకున్నారు. పోటీలో గెలుచుకున్న రూ.10 వేల బహుమతి మొత్తాన్ని తలసేమియాతో బాధపడుతున్న చిన్నారి ప్రసన్న వైద్య ఖర్చుల కోసం అందజేశారు. క్రీడాస్ఫూర్తితో పాటు మానవత్వాన్ని చూపిన జట్టు సభ్యులను గ్రామస్థులు అభినందించారు.
NGKL: మొల్గర గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో సర్పంచ్ సులోచనమ్మ శుక్రవారం వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాడుగుల రమేశ్ ముఖ్య పాత్ర పోషించగా, స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
SRCL: సిరిసిల్లకు చెందిన ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన మాయి ముంత, సావు డప్పు వంటివి కథలు మాత్రమే కావని, మన అస్థిత్వ వేదనలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణ జన జీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దింటి ఇటీవల రాసిన కథలు చదివానని.. అవి చాలా బాగున్నాయన్నారు. దీంతో అతన్ని X వేదికగా అభినందించారు.
NRML: జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల్లో ఎలాంటి లోపాలు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న మరమ్మతు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
JGL: ధర్మపురి మండలంలోని జైనలో గ్రామంలో శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో 10 గొర్రె, మేక పిల్లలు మృతి చెందాయి. సంబెట గంగాధర్ వీటిని తన పాక వద్ద చుట్టూ కట్టిన జాలీలో వదిలాడు. కుక్కలు జాలి కింది నుంచి లోపలికి చొరబడి దాడి చేశాయి. ఈ క్రమంలో ఆరు గొర్రె, నాలుగు మేక పిల్లలు మృతి చెందగా రెండు గొర్రె పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.
KNR: కరీంనగర్ రూరల్ మండలంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జి. నర్సింహారావును జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు మాసం సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజల సమస్యలపై చర్చించి, పారదర్శకంగా సేవలు అందించాలని కోరగా, సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
PDPL: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి రెడ్డి కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, కునారం, తదితర గ్రామాలలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత రైతులకు ధైర్యం చెప్పారు.