పెద్దపల్లి పట్టణంలోని కునారం రోడ్ పబ్లిక్ టాయిలెట్ల వద్ద ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ల మల్లయ్య మొక్కలు నాటారు. చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
KMM: అట్టడుగు స్థాయి ఉనికిని బలోపేతం చేయడానికి ఖమ్మం జిల్లా కమిటీని నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ప్రకటించింది. జిల్లా కన్వీనర్‌గా స్వర్ణ సుబ్బారావు, కో కన్వీనర్‌గా పసుమర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గంధం పుల్లయ్య, సభ్యులుగా రవి కుమార్, నరసింహారావు, నవీన్, సూర్యదేవర సంగమేశ్వర ప్రసాద్, మురళిలను నియమించారు.
MNCL: బెల్లంపల్లి ఏరియా ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ వద్ద AITUC ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. 2025 సెప్టెంబర్‌లో అందజేయాల్సిన పంప్ ఆపరేటర్ల ప్రమోషన్లను యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని కార్మికులు ఆగ్రహించారు. మైన్స్ స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలుమార్లు విన్నవించినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఆందోళన చేపట్టామన్నారు.
వనపర్తి జిల్లాలో ఎండల తీవ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా పానగల్ మండలం రేమద్దులలో 36.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి 36.4, వెలుగొండ 36.2, మదనపూర్ 35.8, రేవల్లి 35.7, వీపనగండ్ల, కన్నాయిపల్లి 35.5, గణపూర్ 35.4, గోపాల్ పేట 35.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలు భాగంగా ఆరవ రోజు హోటల్‌ను మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హోటల్లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యత గల ఆహారాలు విక్రయించే విధంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. హోటలలో శుభ్రత పాటించాలని సూచించారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలు భాగంగా ఆరవ రోజు పలు హోటల్స్‌ను మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హోటల్లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యత గల ఆహారాలు విక్రయించే విధంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. హోటల్‌లలో శుభ్రత పాటించాలని సూచించారు.
RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్ భర్త జంగయ్య మృతి చెందాడు. లాల్ పాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. జంగయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
SRCL: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెస్ ఉద్యో గులు 72 గంటల విధుల బహిష్కరణ చేపట్టారు. ఈ మేరకు బుధవారం ఉదయం సిరిసిల్ల సెస్ ఆవరణలో నిరసనకు తెలిపారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాలను రెగ్యులరైజ్ చేయాలని, అసిస్టెంట్ హెల్పర్ అనే పేరును జేఎల్ఎంగా మార్చాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్ వద్ద సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటకం, బెంచీల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్మశాన వాటికకు వచ్చే ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు బెంచీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
HYD: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చర్లపల్లిలోని హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీఎల్ సంస్థల్లో ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈమేరకు వాణిజ్య సిలిండర్ల వినియోగంపై కంపెనీలు నియంత్రణ విధిస్తున్నాయి. దీనివల్ల కమర్షియల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగి హోటల్, పరిశ్రమలకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో పలు ట్యాంకర్లు డిపోల వద్దే నిలిచిపోయాయి.
MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన దాసరి సతీష్ అదే గ్రామానికి చెందిన దాసరి నగేష్‌ను గత నెల 11న రాత్రి సమయంలో ఓ ఫంక్షన్ హాల్‌లో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన ఎస్సై చిర్ర రమేష్ బాబు పాత కక్షలను దృష్టి పెట్టుకుని కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. బాధితుడు నగేష్ ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
WGL: మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితుల వల్ల ఉమ్మడి జిల్లాలో వంటగ్యాస్ సరఫరా తీవ్రంగా ఆలస్యమవుతోంది. జిల్లాలో మొత్తం 11.14 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, గతంలో 2-3 రోజుల్లో అందుకునే సిలిండర్లు ఇప్పుడు 10 రోజులకు పైగా పడుతున్నాయని డీలర్లు తెలిపారు. గ్యాస్ ధర ఒకేసారి రూ.60 పెరిగి రూ.984కి చేరుకోవడంతో పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
JN: రైతు భరోసా నిధులు రాకపోవడంతో జిల్లా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సరైన సమయానికి పెట్టుబడి సహాయం అందలేదని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సమయానికి రైతు బంధు పడేదని, ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు.
KMM: జిల్లా కారేపల్లి మండలంలో బుధవారం ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా పలు గ్రామపంచాయతీలలో సర్పంచులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని భాజ్య తండాలో రహదారుల వెంట ఉన్న చెత్తను మల్టీపర్పస్ వర్కర్లతో తొలగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు జరుగుతున్నాయని సర్పంచ్ వి. హనుమంతరావు తెలిపారు.
NLG: అప్పు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆంజనేయులు, శంభు లింగం మధ్య అప్పు విషయంలో ఘర్షణ తలెత్తింది. శంభు లింగంకు తీవ్రగాయాలు కావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంభు లింగం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.