SRD: పటాన్ చెరువు, రామచంద్రపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను చేపట్టే ఈ నియామకాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు సంబంధిత మండల వనరుల కేంద్రాల్లో (MRC) దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
BDK: అశ్వారావుపేట ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకులంలో నిర్వహించిన ‘మాక్ పార్లమెంట్’ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ప్రిన్సిపల్ సంగీత రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థినులకు పార్లమెంటరీ విధానాలపై శిక్షణ ఇచ్చారు. స్పీకర్‌గా తాజాని, ప్రధానిగా ఎం.డి. ఆయేషా నిమ్రా పాత్రలను సమర్థంగా పోషిస్తూ సభా నిర్వహణను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.
HYD: బాధ్యతగల జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ప్రభుత్వ కార్డులు అందుతాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అక్రిడిటేషన్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
BHNG: జిల్లాలో మహిళా సంఘాల కోసం ప్రభుత్వం సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్న సంఘాల కోసం ఒక్కో భవనానికి రూ. 10 లక్షల నిధులు కేటాయించింది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే 186 భవనాలకు అనుమతులు లభించాయి. 200 గజాల స్థలంలో నిర్మించే ఈ భవనాలు పూర్తయితే మహిళలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది.
KNR: కొత్తపల్లి మండలం రేకుర్తిలో విస్తుపోయే దొంగతనం వెలుగుచూసింది. అమ్మవారికి మట్టెలు చేయిస్తామని, ఆర్థిక సాయం కావాలంటూ ఇద్దరు మహిళలు రాగా.. అనూష అనే యువతి కొంత నగదు సహాయం చేశారు. అయితే అనుషను మాటల్లో దించి, ఆమె నుదుట మత్తుమందు కలిపిన బొట్టు పెట్టారు. ఈ క్రమంలో అనూష స్పృహ కోల్పోగా, అనంతరం ఇంట్లోని నగదు, నగలతో పరారయ్యారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.
WGL: గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మల గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతి లేకుండా JCB సాయంతో మట్టి తవ్వి తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు గీసుగొండ CI విశ్వేశ్వర్ ఇవాళ తెలిపారు. అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి JCBని సీజ్ చేసినట్లు CI వెల్లడించారు.
ADB: ఉట్నూర్ మండలం షాంపూర్‌లో అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఖానాపూర్ MLA , నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధితుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అవసరమైతే వారిని రిమ్స్‌కు తరలించాలన్నారు.
NLG: ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం గుండ్లపల్లి(డిండి) మండలం దాసరినెమలిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
SRPT: సూర్యాపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అధికారుల నిర్లక్ష్యం రోగులను అయోమయానికి గురిచేస్తోంది. రాజీవ్ నగర్ యూపీహెచ్‌సీ పునర్విభజనలో 23వ వార్డులోకి మారినా, బోర్డుపై మాత్రం పాత ‘21వ వార్డు’ నంబరే ఉండటం గమనార్హం. చిరునామా తెలియక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వార్డు నంబర్‌తో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
MDK: రామాయంపేట బైపాస్ రోడ్డు భూనిర్వాసితులు సోమవారం ఎంపీ రఘునందన్ రావును ఆయన నివాసంలో కలిశారు. మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.19 కోట్లు నిధులు కేటాయించడంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. మార్కెట్ ధరతో సమానంగా తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
VKB: వికారాబాద్ మున్సిపల్ ఛైర్మన్ గడ్డం అనన్య వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను తెల్లవారుజామున పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన క్రీడలలో జరుగుతున్న పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం ఉపేక్షించేది లేదని పట్టణంలోని అన్ని ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు సలహాలు చేశారు.
BDK: ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా పనుల్లో ఉండనున్నారు. పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
HYD: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు భారీగా ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి సర్కిల్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. లేన్ క్రమశిక్షణ పాటించాలని కోరారు.
PDPL: సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన ముక్కెర రాజ్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఇవాళ ఆయన కుటుంబానికి 2018 డిగ్రీ బ్యాచ్ స్నేహితులు చేయూతనందించారు. మానవత్వాన్ని చాటుతూ రూ.30 వేలు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో స్నేహితుల మద్దతు ఎంతో బలాన్నిస్తుందన్నారు.
SDPT: తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని BJP నాయకులు మండిపడ్డారు. నియోజకవర్గంలో అరెస్టైన ఆశా వర్కర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచిన వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.