SRD: రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్‌పల్లి వరకు 161.5 కి.మీల మేర 6వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా దీనిని నిర్మించనున్నారు. ఈ రహదారికి ఎన్హెచ్-161AAగా నామకరణం చేస్తూ రూ.20,737 కోట్లు కేటాయించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాష్ రూమ్‌లలో నీరు లేక దుర్వాసన వ్యాపించడంతో రోగులు ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన పై అధికారులు స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
GDWL: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆదివారం అలంపూర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎస్పీ మంత్రికి వివరించారు.
WNP: వివాహాది శుభకార్యాలకు, విహారయాత్రలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు ఇవ్వనున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రైవేటు వాహనాల కన్నా తక్కువ ధరలకు బస్సులు వస్తాయని డ్రైవర్ బత్తా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు. వివరాలకు 7995701851,9676563377 నంబర్లను సంప్రదించాలని కోరారు.
KMR: రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారీక్ అన్సారీ ఈనెల 24న జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో కలిసి మైనార్టీ సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రతో భేటీ అవుతారని జిల్లా ఉన్నత అధికారులు తెలిపారు. మైనార్టీల సమస్యలు, వారి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష జరుపుతారు.
WGL: వరంగల్ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి కాగా 6వ నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం గురుకుల ప్రవేశ పరీక్షలు ఆదివారం 9 కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహించినట్లు DCO పి. అపర్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,933 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,744 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 94.67గా నమోదైనట్లు వెల్లడించారు.
BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ లలిత ప్రజల సౌకర్యార్థం మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపించారు. ఆదివారం గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు మంచినీటికి కొత్త పైపులైన్లు వేయించారు. వారు మాట్లాడుతూ.. రానున్న ఎండాకాలం దృశ్య నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపురం పరిధిలోని పలు కాలనీలలో రూ. 4.5 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణితో కలిసి పాల్గొన్నారు. కాలనీలలో మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
NZB: మగ్గిడి పాఠశాలలో 12 రోజులుగా సాగుతున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది బాలికలు, 14 మంది బాలురను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి హనుమంత్ రెడ్డి తెలిపారు. వీరు ఈనెల 24 నుండి మార్చి 1 వరకు పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో జరగనున్న జాతీయ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు.
NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కీళ్ల నొప్పులు, పక్షవాతం, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు నిపుణులైన డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ రాజేందర్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ శిబిరానికి గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్-2026’ రెండో దశ కార్యక్రమాన్ని చేపట్టినట్లు SP నితిక పంత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు వారం రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించని వారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుటామని అన్నారు.
SRPT: కోదాడ పట్టణంలో వ్యాధుల నివారణకు మున్సిపల్ యంత్రాంగం నడుము బిగించింది. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ ప్రారంభించారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అన్ని వార్డుల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
KMM: సింగరేణిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యుడు, న్యూరో రిహాబ్ ఎడ్యుకేటర్ ఫౌండర్ డాక్టర్ బాదావత్ రవి ఆధ్వర్యంలో ‘మిషన్ వాక్’ స్వచ్ఛంద సంస్థ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కారేపల్లి, భాగ్యనగర్ తండా సర్పంచ్లు మేదరి వీర ప్రతాప్, బానోత్ హీరాలాల్ కలిసి ప్రారంభించారు.
BDK: మణుగూరు ప్రాంతానికి చెందిన సంతోష్ – రమాదేవి దంపతుల కుమార్తెలు లావణ్య మరియు వెంకట శ్రీల ఓణీల అలంకరణ వేడుకలో నేడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బాలికలకు ఆశీస్సులు అందించి, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కుటుంబ వేడుకలు సమాజంలో ఆనందాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ADB: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 24 మంగళవారం జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే కార్యవర్గాలు తెలిపాయి. ఇటీవల అరెస్ట్ అయిన ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.