MHBD: కారులో వచ్చి గొర్రెపోతును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడ మండల మోకాళ్లపల్లిలో నిన్న అర్ధరాత్రి పశువుల కాపరి కొమ్మయ్య దొడ్డిలో కట్టిన గొర్రెల మందలో ఒక ఖరీదైన గొర్రెపోతును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసిన గొర్రెపోతు విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఇవాళ బాధితుడు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
MBNR: నవాబ్‌పేట మండలంలోని పలు వాణిజ్య సంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న సంస్థల నుంచి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్ తెలిపారు. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
PDPL: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న, కేంద్ర ప్రభుత్వంపై ప్రతి యువ కార్మికులు ఎదురు తిరగాలని CITU రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. GDKలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం ‘భారత కార్మికోద్యమం – CITU పని విధానం’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రతి హిందువు నా బంధువు అంటూనే కేంద్ర ప్రభుత్వం మన మధ్య తగాదాలు పెడుతుందన్నారు.
SRCL: అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులతో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆవిష్కరించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్‌సీ, బీకాం, బీఏ, తదితర కోర్సుల వివరాలతో సిద్ధం చేసిన పోస్టర్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి విడుదల చేశారు.
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని ఓ సీడ్స్ పరిశ్రమలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆఫీస్ తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. పరిశ్రమ కార్యాలయంలో ఉన్న రూ. 20వేల రూపాయల నగదు, పూజ సామాగ్రి ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KNR: ఫైళ్లలో తప్పులను సరిదిద్దేందుకు లంచం డిమాండ్ చేసిన కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయ సూపరింటెండెంట్ ఇగాల మధుసూదన్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. బినామీ ఖాతా ద్వారా సుమారు రూ. 14.77 లక్షల మేర యూపీఐ లావాదేవీల రూపంలో లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ, కేసు నమోదు చేశారు.
BDK: కలెక్టర్ అంకిత్ ఇవాళ ఐడీఓసీ (IDOC) సమావేశ మందిరంలో వివిధ శాఖల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ పనులు ఆలస్యం కాకుండా ఉండాలంటే భూ కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ సంబంధిత అంశాలు, భూ సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండాలని తెలిపారు.
JGL: మెట్‌పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ ఆడిట్‌కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య వివిధ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. రానున్న అకాడమిక్ ఆడిట్‌ను దృష్టిలో ఉంచుకుని అటెండెన్స్, మార్కుల రిజిస్టర్లు సహా బోధనకు సంబంధించిన రికార్డులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో MRO లక్ష్మీ రాజయ్యకు సోమవారం BJP మండల అధ్యక్షుడు విష్ణు యాదవ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చకపోతే BJP పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో BJP నేతలు ఉన్నారు.
NRPT: ప్రజలు తమ ఆస్తి పన్ను, కొళాయి, వ్యాపార పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య కోరారు. సోమవారం నారాయణపేట పట్టణంలో పనులు వసూలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కువ మొత్తం పన్నులు బకాయి ఉన్నవారి వద్దకు కమిషనర్ వెళ్లి పన్నులు వసూలు చేశారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలో నీటి ఆయోగ్ పథకం కింద నూతనంగా నిర్మించిన సంగ్రహాలయం (మ్యూజియం)ను ఈనెల 18వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ఎంపీడీవో పుల్లారావు తెలిపారు. ఇందులో ఏర్పాటు చేసే గిరిజనుల పురాతన వస్తువులపై ప్రజలకు అవగాహన కలుగుతుందన్నారు. అనంతరం తాడిహత్నూర్ గ్రామంలో దాల్ మిల్ ప్రారంభిస్తామన్నారు. దీంతో ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
పెద్దపల్లి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ” డ్రైవర్ ఎంపవర్‌మెంట్ 2025-26 పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు, డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన యువత మార్చి 17 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, స్వయం ఉపాధి పొందాలని సూచించారు.
KNR: జమ్మికుంట మండలం విలాసాగర్‌లో సుమారు రూ. 40 లక్షలతో నిర్మించనున్న నూతన శివాలయ నిర్మాణానికి సర్పంచ్ శ్రీధర్ ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టారు. అర్చకులు సముద్రాల కిషోరాచార్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ బాబురావు, సర్పంచ్ శ్రీధర్ మాట్లాడుతూ.. రేగేళ్ల శివశంకర వరప్రసాద్-స్రవంతి దంపతులు స్వచ్ఛందంగా స్థలం అందించారు.
GDWL: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గద్వాల జిల్లా ఇన్‌ఛార్జ్ ఉపాధి కల్పనాధికారి లక్ష్మి సోమవారం వెల్లడించారు. ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఐడీవోసీ కాంప్లెక్స్, ఎఫ్-30/1లో ఈ మేళా జరుగుతుందని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
NGKL: కేంద్ర ప్రాయోజిత ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 29న నిర్వహించే ‘ప్రీ-ఫైనల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ పరీక్షకు లబ్ధిదారులు విధిగా హాజరయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. వయోజనులకు చదువు నేర్పిన వారు తప్పనిసరిగా ఈ పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.