BDK: భద్రాచలంలో మార్చి 27, 28 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణం మహా పట్టాభిషేక ఉత్సవాలకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
KMM: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇళ్లను పరిశీలించి పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఖమ్మం చేరుకోనున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలకాలని కోరారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలో ఈ నెల 8న ప్రజా గాయకుడు విగ్రహం ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆవిష్కరణకు సంబంధించి గోడపత్రికను మున్సిపల్ ఛైర్ పర్సన్ బృంగి రత్నమాల శనివారం రాత్రి ఆవిష్కరించారు. గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ కన్వీనర్ లక్ష్మణ శర్మ, సభ్యులు రజిత, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో విద్యార్థిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ డిమాండ్ చేశారు. శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ… అధికారుల అండదండలతోనే పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని హెచ్చరించారు.
BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మార్చి 2న స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ EO మహేష్ తెలిపారు. ఉదయం 10:30 గం శుభానంద ముక్తేశ్వర ప్రధాన ఉత్సవ మూర్తులకు ఈ వేడుక జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని EO కోరారు.
GDWL: మనిషి జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందని రెడ్ క్రాస్ సొసైటీ గద్వాల జిల్లా వైస్ ఛైర్మన్ డాక్టర్ తాహెర్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినాన్ని శనివారం అయిజలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సైన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి ప్రాథమిక దశ నుంచి సైన్స్ పై అవగాహన పెంచుకోవాలన్నారు.
HYD: ప్రాపర్టీట్యాక్స్ పరిష్కారం కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఈ నెలలోని 5 ఆదివారాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజలు ఆస్తి పన్ను సంబంధిత సమస్యలు, రివిజన్ పిటిషన్లు, ఆన్‌లైన్ బకాయిల సవరణలు, కోర్టు కేసులు, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వీయ అంచనా సమస్యలు వంటి వాటిని అధికారుల దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.
WGL: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చి, అభియోగాల నుంచి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జాగృతి నాయకులు సుశీల్ గౌడ్, రోహిత్ కుమార్ ఇవాళ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి నేతలు తదితరులు ఉన్నారు.
KNR: సైదాపూర్ మండలంలోని విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని సైదాపూర్ TGNPDCL అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ కోరారు. శనివారం సైదాపూర్ మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
SDPT: వర్గల్ మండలం నాచారంగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం 3న మంగళవారం కేతు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకొని మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో రంగాచారి తెలిపారు. ఉదయం 6 గంటలకు ఆలయం, ఉపాలయాలకు ద్వార బంధనం చేస్తున్నట్లు వివరించారు. 4న సంప్రోక్షణ అనంతరం ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
BHNG: పారుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు అధికారులుగా రాజకీయ నాయకులుగా వ్యవహారించారు. ముఖ్యమంత్రిగా మహావీర్ చంద్ర, విద్యాశాఖ మంత్రిగాగిరెడ్డి స్నేహ, ఎమ్మెల్యేగా వైష్ణవి, అడిషనల్ కలెక్టర్లుగా అజయ్ శ్రావిక నందిని, ఎంపీగా రుచిత, డీఈవోగా అనూష, నిర్వహించారు..
KMR: భూతగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. CI రవి తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుందకు చెందిన సాయిలు, అతని సోదరుడు నారాయణ మధ్య కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తున్నాయి. ఆగ్రహానికి లోనైన నారాయణ సాయిలు తలపై కర్రతో బలంగా బాదాడు. తీవ్ర గాయాలైన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు నారాయణను పట్టుకుని, హత్యకు వాడిన కర్రను స్వాధీనం చేసుకున్నారు.
SRD: జిల్లాలోని నిరుద్యోగ మైనార్టీ యువతకు ఈ-స్కూటీల పంపిణీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. అర్హులు మార్చి 1వ తేదీలోపు tsobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి కార్పొరేషన్ రూ.1.20 లక్షలు అందజేస్తుంది.
మహబూబ్‌నగర్ నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న ఉమారామలింగేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు బైరా ఖాన్ పల్లిలోని శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో కూడా ఆమె పాల్గొన్నారు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.
ADB: ఈరోజు నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.