BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. దీంతో ఉచిత సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
PDPL: అంతర్జాతీయ మహిళా దినోత్స నేడు వేడుక కాదు.. పోరాట దినమని పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. మహిళలను విధాన నిర్ణయాల్లో భాగస్వాములను చేయాలని, రిజర్వేషన్లను గౌరవించాలని డిమాండ్ చేశారు.
JGL: కథలాపూర్ మండలవ్యాప్తంగా 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. పెద్ద శబ్దం వినిపించడంతో ప్రజలందరూ ఒక్కసారిగా బయటికి వచ్చి భయబ్రాంతులకు గురయ్యారు. ఆదివారం సుమారు 12:47 నిముషాల సమయంలో భూమి కంపించింది. దీంతో ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు భయందోళనకు గురయ్యారు. గతంలో ఇలాంటి శబ్దం ఎప్పుడు వినిపించలేదని ప్రజలు పేర్కొంటున్నారు.
KNR: గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా గ్రామ మహిళలను సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ శాలువాలతో సత్కరించారు. అనంతరం కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. స్త్రీని పూజించిన చోట దేవతలు పూజింపబడతారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో స్థిరపడలన్నారు. గ్రామ మహిళల అభివృద్ధి విషయంలో సహాయ పడతానని ఆయన హామీ ఇచ్చారు.
MBNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాలానగర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన 24 ఏళ్ల శశివర్ణ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇటీవల జరిగిన GP ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించిన ఆమె, జిల్లాలో అతి చిన్న వయసులో మహిళా సర్పంచ్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం బీఈడీ చదువుతున్న శశివర్ణ, చదువుతో పాటు ప్రజాసేవలో ముందుకు సాగుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
NLG: జిల్లా ఎరుకల ఉద్యోగుల సంఘం నాయకులు ఆదివారం నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చర్లపల్లి వెంకటయ్య, కోశాధికారి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మొగిలి విజయ్ శేఖర్, గౌరవాధ్యక్షులు ఉండ్రాతి కృష్ణయ్య, సహా పలువురు ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. అనంతరం ఎరుకల సంఘం సంక్షేమంపై చర్చించారు.
NZB: బాల్కొండ మండలం రంగనాథ స్వామి సాక్షిగా, పైలా నరసింహయ్య యాదవ్ ఆధ్వర్యంలో 24 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నూతన వధూవరులను ఆశీర్వదించారు. పేద కుటుంబాలకు బాసటగా నిలుస్తూ నరసింహయ్య చేస్తున్న సామాజిక సేవ అభినందనీయమని కొనియాడారు.
SRPT: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ముందస్తు జాగ్రత్తతో ప్రాణాంతకం వ్యాధులను అరికట్టవచ్చన్నారు.
MLG: పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కిషోర్ కుమార్ సిబ్బందితో కలిసి మహిళా పోలీస్ కానిస్టేబుల్లను శాలువతో సత్కరించారు. విధుల నిర్వహణలో మహిళా పోలీసులు చూపుతున్న ధైర్యం, సాహసం, నిబద్ధత అభినందనీయమని DSP కొనియాడారు. కార్యక్రమంలో సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది ఉన్నారు.
RR: చేవెళ్ల మండలంలోని నాంచేరి ఇంద్రారెడ్డి నగర్‌లో బీరప్ప, మల్లన్న దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA కే రత్నం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు సమాజ ఐక్యతకు కేంద్ర బిందువులు అన్నారు.
MNCL: తాండూర్ మండలంలో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్ల నుంచి విలువైన కాపర్ వైర్ చోరీ చేస్తున్న పదిమంది సభ్యుల ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దొంగిలించిన కాపర్ స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ దేవయ్య తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
NRML: జిల్లా పెంబి బ్లాక్ మరో అరుదైన గౌరవం సాధించింది. మార్చి 9న విశాఖలో జరిగే నీతి ఆయోగ్ రీజనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సదస్సుకు ఇది ఎంపికైందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. తెలంగాణ నుండి నిర్మల్, గద్వాల జిల్లాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. విద్య, ఆరోగ్యం (అమ్మ రక్షిత, బాలశక్తి), వ్యవసాయ రంగాల్లో పెంబి సాధించిన విజయాలను ఈ సదస్సులో వివరించనున్నారు.
ADB: గాదిగూడ మండల కేంద్రంతో పాటు పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సై రమ్య తెలిపారు. ఎలాంటి గొడవలు, చోరీలు, అక్రమ దందాలను అడ్డుకుంటూ శాంతి భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు విజయవంతం చేయాలనీ ఆమె పేర్కొన్నారు.
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ఇన్‌స్పైర్ ప్రాజెక్టులకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఇవాళ పాఠశాల HM అపర్ణ తెలిపారు. HM మాట్లాడుతూ.. ‘స్మార్ట్ బ్లైండ్ స్పాట్’ ప్రాజెక్టుకు విక్షిత, సౌరశక్తితో నడిచే పాములు, కీటకాలను దూరం చేసే వ్యవస్థ ప్రాజెక్టుకు హారిక ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను HM అభినందించారు.
HYD: మహిళా దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ డివిజన్‌లో మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాలలో మహిళలు రాణించడం గర్వకారణమని, ఎప్పుడూ మహిళలు ముందుండి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.