NLG: మాడుగులపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చెరువుపల్లి గ్రామానికి చెందిన పాలువాయి సుమలతతో పాటు మరో ఇద్దరు మహిళలకు తహసీల్దార్ సామల సరోజ పావని చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి పాల్గొన్నారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ పరిధి సాయి కాలనీ, శ్రీనివాస కాలనీలలో నల్లాల ద్వారా గత నాలుగు రోజులుగా అపరిశుభ్రమైన మంచినీరు సరఫరా అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా పాత పైపు లైన్ స్థానంలో ఏర్పాటు చేసిన కొత్త పైపు లైన్‌లో పేరుకుపోయిన మట్టితో కూడిన నీరు నల్లాల ద్వారా వస్తుండడంతో తాగలేని పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.
SDPT: దుబ్బాక మండలం రఘోతంపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చిన్నారెడ్డి మోహన్ రెడ్డి అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VKB: పులిమామిడికి చెందిన సామాజికవేత్త రత్న మొల్ల రవీందర్ రెడ్డి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. నవాబుపేట్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) తో పాటు చించేల్‌పేట్, గంగ్యడ గ్రామాల్లో ఆయన స్వచ్ఛందంగా హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో PHC డాక్టర్ రోహిత్, ANMలు, ఆశా వర్కర్లు పాల్గొని కిట్లను స్వీకరించారు.
NZB: డిచ్‌పల్లిలోని మానవతా సదన్ విద్యార్థులకు 7వ బెటాలియన్ పోలీసులు చేయూతను అందించారు. బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ ఆదేశాల మేరకు యాన్యువల్ రిఫ్రెషర్ కోర్స్‌లో భాగంగా అధికారులు, సిబ్బంది మంగళవారం మానవతా సదన్‌ను సందర్శించారు. అక్కడి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు.
JN: జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి చంద్రరుషి తెలిపారు. 20వ తేదీ లోపు నామినేషన్ల స్వీకరణ,ఉపసంహరణ, 30వ తేదీన ఎన్నికలు, ఫలితాల ప్రకటన జరుగుతుందన్నారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.
NGKL: అచ్చంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. వరుసగా పండుగలు, ఇతర కారణాల రీత్యా మార్చి 18 నుంచి మార్చి 21 వరకు మార్కెట్‌కు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. వరుసగా నాలుగు రోజుల పాటు మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. తిరిగి మార్చి 22 నుంచి క్రయ విక్రయాలు యథాతథంగా ప్రారంభమవుతాయని కమిటి తెలిపింది.
SRD: నిర్మల్ జిల్లా బాసర RJUKTలో పీయూసీ-2 చదువుతున్న సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన మల్లిపూడు తేజస్విని అనారోగ్యంతో మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఇంటి వద్దే చికిత్స పొందుతూ కన్నుమూసింది. విద్యార్థిని అకాల మరణం పట్ల విశ్వవిద్యాలయ యంత్రాంగం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున వీచిన ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలినట్లు రైతు శరత్ బాబు తెలిపారు. తనకు గల వ్యవసాయ పొలంలో మామిడి తోట సాగు చేయగ ఈదురు గాలుల వల్ల పెద్ద ఎత్తున మామిడికాయలు నీలరాలినట్లు తెలిపారు. భారీగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
NLG: అనుముల మండలంలో కబడ్డీ అంటే నాయుడుపాలెం పేరు ముందుంటుంది. ఇక్కడి యువత ఆటలో రాణించడంతో పాటు క్రీడా కోటాలో ఉద్యోగాలను సాధిస్తున్నారు. వీరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేషనల్ స్థాయిలో సుమారు 10 మందికి పైగా, రాష్ట్రస్థాయిలో 15 మందికి పైగా ఎంపికయ్యారు. ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయన్నారు.
NZB: జిల్లాలో ఉగాది పండుగ అటు భక్తిని, ఇటు గ్రామీణ సాహస క్రీడలను కలబోసిన వేడుకలా నిలుస్తోంది. మాక్లూర్ మండలం ఓడ్డేట్‌పల్లిలో ఒడ్డేటమ్మ తల్లి జాతరతో భక్తులు పులకించిపోతుంటే, పల్లెల్లో కళాకారుల జడకొప్పులాట, కుస్తీ పోటీలు పాతకాలపు వైభవాన్నిగుర్తుచేస్తున్నాయి. ఎడ్లబండ్ల కొరతతో రైతులు తమ ట్రాక్టర్లనే అందంగా అలంకరించి ఊరేగించడం సరికొత్త సంప్రదాయానికి నాందిపలికారు.
MBNR: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా CEIR పోర్టల్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉందని రాజాపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే ఆందోళన చెందకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ పోర్టల్ ద్వారా ఫోన్ ఏ లొకేషన్‌లో ఉందో కనిపెట్టి బాధితులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
KMM: లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలించి, అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు CPI (ML) ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. వెలుగుమట్ల భూముల్లో అనర్హులకు స్థలాలు కేటాయించడాన్ని నిరసిస్తూ బాధితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 2018 నుంచి అక్కడ నివసిస్తున్న 400 మంది అసలైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
JGL: TGNPDCL పరిధిలో కొత్త సర్వీసుల కోసం సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని SE సుదర్శనం తెలిపారు. కొత్త LT కనెక్షన్లు, అదనపు లోడ్ కోసం సర్వీస్ లైన్ ఛార్జీలను ఏకరీతిగా నిర్ణయించామన్నారు. స్థల పరిశీలన లేకుండా కొత్త సర్వీసులు అందిస్తున్నామని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీ స్టోర్ భవనాలకు లోడ్ ఆధారంగా చార్జీలు ఉంటాయని SE వెల్లడించారు.
RR: కొందుర్గ్ మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నారు. రేడియల్ రోడ్డు భూ బాధితుల సమస్యలపై చర్చించేందుకు RDO, MRO హాజరవుతారని సర్పంచ్ కమ్మదనం జ్యోతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ బాధితులందరూ తప్పక హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు.