GDWL: అలంపూర్ మున్సిపాలిటీలో శాశ్వత ఏఈ లేకపోవడం వల్ల మున్సిపాలిటీ పనులు నిలిచిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా ఉన్న ఏఈ కూడా అందుబాటులో లేక ప్రజలు కార్యాలయానికి వెళ్లినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే శాశ్వత ఏఈని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
WGL: నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామంలో రూ.10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు.
NDL: కోవెలకుంట్లలోని పలు కాలనీలలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో క్లాప్ మిత్రలు ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించారు. పంచాయతీ అధికారులు మాట్లాడుతూ.. క్లాప్ మిత్రలు మీ ఇంటి దగ్గరకు వచ్చినపుడు చెత్తను రిక్షాలలో గానీ పంచాయతీ ట్రాక్టర్‌లో గానీ వేయాలన్నారు. కాలువలలో వేయకూడదని, IVRS కాల్స్ వచ్చినపుడు చెత్తను సేకరిస్తారని వారికి అవగాహన కల్పించారు.
MDK: నర్సాపూర్ నియోజకవర్గంలోని యెల్దుర్తి మండల మానేపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో జాతరను నిర్వహించారు.
ఢిల్లీ, పంజాబ్.. IPL తొలి సీజన్ 2008 నుంచి ట్రోఫీ అందుకోలేకపోయిన జట్లు. కెప్టెన్లు, కోచ్‌లు, ప్లేయర్లు.. ఆఖరికి టీమ్ పేరు మార్చినా ఫలితం లేకపోయింది. 2020లో DC రన్నరప్‌గా నిలవగా.. 2014 & 25లో పంజాబ్ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇక 17 ఏళ్లు ఇదే లిస్టులో ఉన్న RCB గతేడాదే PBKSని ఓడించి తమ తొలి కప్ గెలిచింది. మరి IPL 2026లో అయినా ఈ జట్ల కల నెరవేరుతుందేమో చూడాలి.
KDP: మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెలోని నూతన కోదండ రామ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు ఇవాళ తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి మూడు రోజులపాటు పూజలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా పెద్దమ్మ, మారెమ్మ, గంగమ్మ గ్రామ దేవతలతోపాటు కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజలు ఉంటాయన్నారు.
కోనసీమ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుండలేశ్వరం శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయ ప్రధాన పూజారిగా కాళ్ళకూరి నాగమల్లేశ్వర శర్మ నియమితులయ్యారు. వంశపారపర్యంగా వస్తున్న అర్చకత్వ వంతుల నేపథ్యంలో ఆయనకు ఆదివారం ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయనకు అర్చకులు, భక్తులు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ఈవో దుర్గ, రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు సత్య సీతారామశర్మ తదితరులు పాల్గొన్నారు.
MNCL: పంట వేసిన ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొండ గొర్ల లింగన్న కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటలు వేసేందుకు ప్రభుత్వం అందించే రైతు భరోసా డబ్బులు ఇవ్వడంలో జాప్యం ఎక్కువగా జరుగుతుందన్నారు. దీంతో పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
W.G: శక పురుషుడు శాలివాహనుడు జయంతి ఆదివారం తణుకులో ఘనంగా నిర్వహించారు. శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సొసైటీ రోడ్డులో శాలివాహనుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శాలివాహన చక్రవర్తి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమము సంఘం జిల్లా అధ్యక్షులు గురుజకోట రాకేష్ బాబు పాల్గొన్నారు.
MDCL: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల రిపోర్టును అధికారులు విడుదల చేశారు. అత్యధికంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 44 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా అల్వాల్, గోపులారం ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 11 కేసుల నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం రెట్టింపు అవుతుందన్నారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటనలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల్లోనే నాలుగు సంఘటనలు చోటుచేసుకోవడంతో మహిళల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ద్విచక్ర వాహనాలపై వచ్చే దుండగులు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు లాక్కొని పారిపోతున్నారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
KMM: కల్లూరు మండలంలో యాసంగి ధాన్యం సేకరణకు త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రూప తెలిపారు. ఇటీవల మండలంలో వరి కోతలు ప్రారంభం కాగా ఇప్పటికే సుమారు 200 ఎకరాల్లో రైతులు పంటను కోశారని వెల్లడించారు. ఈ సీజన్‌లో మండల వ్యాప్తంగా దాదాపు 34 వేల ఎకరాల్లో యాసంగి వరి సాగు జరిగిందని ఆమె పేర్కొన్నారు.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు ‘బావ బావమరిది’ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్.
HYD, RR, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచే దిశగా సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ వోకేషనల్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్ వినియోగంపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు.
HNK: జులైవాడ సర్కిల్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీపై వెళ్తున్న వేల్పుల రజిత (39)ను వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తల, దవడ భాగాల్లో బలమైన గాయాలవ్వడంతో ముక్కు, నోటి నుంచి భారీగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు MGM ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.