CTR: జిల్లాలో అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డుల మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన DMAC రెండవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, ఎన్ వేలాయుధం, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జిల్లాలోని 37 పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 BNSS అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై మంగళవారం కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. భూ సేకరణ సవాళ్లు, మాస్టర్ ప్లాన్ పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే ఆస్తులు, రహదారులు, భవనాలపై చర్చించారు.
MDK: రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడించారు. నిర్వాసితులు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. గజం ప్రభుత్వ విలువ రూ.5,000 ఉండగా కేవలం రూ. 600 చొప్పున పరిహారం ఇవ్వడంపై కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతిపత్రం ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కలెక్టర్ భరోసా ఇచ్చారు.
NZB: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు కలిగిన గ్రామాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని వర్ని ఎస్సై వంశీకృష్ణ రెడ్డి సూచించారు. ఈనెల 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు కలిగిన వర్ని మండల కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని హెచ్చరించారు.
SRPT: నడిగూడెం మండల కేంద్రంలో ఈనెల 25 నుంచి మార్చి18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా మండలంలోని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు SI అజయ్ తెలిపారు. పరీక్షలు సాఫీగా జరిగేందుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుమిగూడడం నిషిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
E.G: గౌరీపట్నం వాస్తవ్యులు, కార్డియాలజిస్ట్ ముళ్లపూడి వెంకటరత్నం (88) సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. తన కుమార్తె జ్ఞాపకార్థం అమెరికా నుంచి వచ్చి గాజులరామారంలో ఆసుపత్రిని స్థాపించారు. మూడున్నర దశాబ్దాలుగా స్వయంగా 20 వేలకు పైగా ఆపరేషన్లు చేసి పేదలకు వైద్యం అందించారు. ఆయన మరణం తీరని లోటని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
GNTR: 2027 జనాభా లెక్కల సేకరణపై గుంటూరులో అధికారులకు శిక్షణ ఇచ్చారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందన్నారు. ఎన్యుమరేటర్లు మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు.
WNP: వనపర్తి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అధికారులు, కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో వాసవి మహిళా సంఘం సభ్యులు పాల్గొని సేవలు అందించారు. భక్తులు సమర్పించిన కానుకలను పారదర్శకంగా లెక్కించి భద్రపరిచారు.
NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని 2019-21 బ్యాచ్ డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు యూనివర్సిటీ చివరి అవకాశం కల్పించింది. ఎలాంటి జరిమానా లేకుండా మార్చి 16 వరకు, రూ.100 జరిమానాతో మార్చి 17 వరకు ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రకాశం: మార్కాపురంలో రేపు జరగబోయే సీఎం బహిరంగ సభకు సంబంధించి సిద్ధం చేసిన హెలిప్యాడ్ వద్ద మంగళవారం హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. నిర్ణయించిన ప్రదేశంలో హెలికాప్టర్ దిగి కొద్దిసేపు నిలిచి, భద్రతా ఏర్పాట్లు,ల్యాండింగ్ సౌకర్యాలను అధికారులు పరిశీలించారు. ఈ ట్రయల్ రన్ ద్వారా హెలిప్యాడ్ సౌకర్యాలు, భద్రతా చర్యలు సక్రమంగా ఉన్నాయా అని అధికారులు ధ్రువీకరించారు.
SRD: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, మార్చి 14 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. 54 ఇంటర్, 123 టెన్త్ కేంద్రాలు ఏర్పాటు చేసి, పోలీసు బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
JN: సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై సీఎం అభినందనలు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించి, ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఛాంబర్‌లో వాణిజ్య పన్నుల వసూలుపై కలెక్టర్ బాలాజీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ పరిధిలో, ఆస్తులు భూములు, క్రయవిక్రయాలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలని తెలిపారు. పన్ను వసూలు సక్రమంగా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.