NLR: సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ASP సీహెచ్ సౌజన్య ఆత్మీయ ఘన వీడ్కోలు పలికారు. ఎస్సై షేక్ అబ్దుల్ రహిమాన్, కె.మల్లయ్య, ఎస్.పాండురంగా రెడ్డి వారి వారి కుటుంబాల నడుమ ఆనందోత్సవాలతో పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
NZB: క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని జిల్లా జడ్జి భారత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్, XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నిఅందిస్తాయన్నారు. బిజీగా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష పలాస నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, ప్రజారోగ్యం వంటి కీలక అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. వేసవిలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ATP: ఉరవకొండలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్తారింటికి వచ్చిన అల్లుడు కజ్జికాయల కోసం గొడవకు దిగాడు. ఇద్దరు పెద్ద అల్లుళ్లకు పిండివంటలు పెట్టి, తనను చిన్నచూపు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరిస్థితి అదుపు తప్పడంతో అత్త వెంటనే ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ అసలు విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు.
NDL: వీబీజీ రామ్ జీ పథకంతో శ్రామికులకు 125 రోజుల పని దినాలు కల్పించడం జరుగుతుందని ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి తెలిపారు. వెలుగోడు ఎంపీడీవో కార్యాలయంలో వీబీజీ రామ్ జీ పథకం కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలలో, రైతులలో అవగాహన పెంచే విదంగా ఆరు వారాల ప్రజా చైతన్య కార్యక్రమాల ప్రణాళికను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
NLG: ఆర్టీసీలో విద్యుత్ బస్సుల విస్తరణతో కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్. రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సమావేశంలో పీఎం ఈ డ్రైవ్ పథకంలో 1085 కొత్త బస్సుల ఒప్పందం, మెకానిక్ల రీ-కేటగిరీ నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు. ఈ సమస్యలపై చర్చించేందుకు నేతలు మార్చి 12న HYD SVK లో జరిగే సదస్సుకు హాజరుకావాలని కోరారు.
సిద్దిపేట: ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉ. 11:00: ఇందిరానగర్ హైస్కూల్లో ‘ప్రేరణ’ కార్యక్రమం మ. 12:00 చిన్నకోడూరు మండలం అల్లిపూర్‌లో పర్యటించనున్నారు. మ. 01:30 క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సా. 04:00 స్టేడియంలో ‘కేసీఆర్ కప్’ క్రికెట్ పోటీలను ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
WNP: పని భారం వద్దు చదువు ముద్దు అని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని ఆదేశాల మేరకు శనివారం వనపర్తి శివారిలోని మెట్టుపల్లి ప్రాంతంలో ఇటికల భట్టిలో పనిచేస్తున్న కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాలలను బడికి పంపించడం మన అందరి బాధ్యత అని కార్మికులకు తెలిపారు
BPT: చుండూరులో జూదం ఆడుతున్న ఐదుగురిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో వారి వద్ద నుంచి రూ. 950 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించాలంటే 112కు కాల్ చేయాలని పోలీసులు కోరారు.
KMM: AP నుంచి TGకు ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌ను అడిషనల్ డీసీపీ సందర్శించారు. అక్రమంగా ఇసుక రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలని సూచించారు.
TG: సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఆస్తులను ED అటాచ్ చేసింది. రూ.14.63 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది. PMLA కింద సదరు సంస్థపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. మోసపూరిత రియల్ ఎస్టేట్ స్కీమ్ ద్వారా డిపాజిటర్లను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకే ప్లాట్లకు పలువురికి విక్రయించినట్లు, రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి డబ్బులు సేకరించినట్లు విచారణలో తేలింది.
ELR: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పలువురు సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందన్నారు.
HNK: కాకతీయ మెడికల్ కళాశాలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. CP సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… కమిషనరేట్ పరిధిలో పేకాటరాయుళ్ళపై కఠినంగా వ్యవహరించాలని, ప్రధానంగా శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని, అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.
KRNL: CM చంద్రబాబుని ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు శనివారం కలిశారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. టెక్స్‌టైల్ పార్క్, AI స్కిల్ సెంటర్, పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. నీటి సమస్యలు నిర్మాణంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
CTR: ఏపీ రాష్ట్ర రెడ్డి సంఘం ఐటీ విభాగ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కార్వేటినగరం(M) ముక్కురానిపల్లికి చెందిన మహేశ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి, సమాజం పట్ల చూపిన అంకిత భావాన్ని గుర్తిస్తూ ఈ నియామకాన్ని ప్రకటించినట్లు రెడ్డి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి తెలిపారు.