JGL: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఇవాళ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి తెలిపారు. డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు.
NZB: నవీపేట్ మండలంలోని పెద్దమ్మ, ఎల్లమ్మ, అయ్యప్ప ఆలయాల్లో జరిగిన దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. గురువారం అయ్యప్ప గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2,770 నగదు, బైక్, రాగి వైర్, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనే 7 కేసులు ఉన్నాయని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
MNCL: మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం మత్తులో ఓ వ్యక్తి గురువారం రాత్రి హల్చల్ చేశారు. మహారాష్ట్రకి చెందిన యువకుడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరాను ముందుగానే నిలిపివేశారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడకు చేరుకోగా, పోలీసుల బుజ్జగింపులతో యువకుడు కిందకి వచ్చాడు.
NDL: జిల్లాలో వైద్య శాఖ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ రాజకుమారి వైద్యాధికారులకు గురువారం సూచించారు. కలెక్టరేట్ నుంచి జూమ్ ద్వారా మెడికల్ ఆఫీసర్లు, సీహెచ్సీ వైద్యులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రోగికి సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలనిన్నారు.
సత్యసాయి: శాసనమండలిలో శ్రీవారి లడ్డూ అంశంపై చర్చకు కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఉషశ్రీచరణ్ విమర్శించారు. పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానాలు ఇస్తున్నప్పటికీ చర్చకు ముందుకు రావడం లేదన్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. చర్చకు ధైర్యంగా రావాలని డిమాండ్ చేశారు.
ATP: జిల్లా రైతుల సంక్షేమం కోసం పశువుల షెడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి కోరారు. ఈ మేరకు పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక అవసరాలను గుర్తించి తగిన సహకారం అందించాలని ఆయనను కోరగా సానుకూలంగా స్పందించారు.
E.G: ఒడిశాలోని భార్గడ్ రోడ్‌లో ఈనెల 11 నుంచి 14 వరకు జరిగిన నేషనల్ వీల్ చైర్ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్ కప్‌తో రాజమండ్రి వచ్చిన క్రీడాకారులు గురువారం రూరల్ తహశీల్దార్ శ్రీనివాసరావు, ధవలేశ్వరం సీఐ టి.గణేశ్, శాప్ ఏఎస్‌వో శేషగిరిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను అధికారులు అభినందించారు.
GNTR: లింగాయపాలెంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. D12 సెక్షన్ పరిధిలో ‘RDSS’ పథకం కింద పాత స్తంభాలను మార్చే పనులను చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి, సరఫరాను పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
PLD: మంత్రి నారా లోకేశ్‌కు పల్నాడు ‘యువగళం’ చిత్రపటాన్ని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బహూకరించారు. గురువారం జరిగిన ఈ ఆత్మీయ భేటీలో యువగళం నాటి విశేషాలు, లోకేశ్ తొలిసారి ‘రెడ్ బుక్’ ప్రస్తావన తెచ్చిన అంశంపై వారు చర్చించుకున్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని అప్పట్లో లోకేశ్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
KKD: జగ్గంపేట టీచర్స్ కాలనీలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఒడిబోయిన మణికంఠ మద్యం మత్తులో భార్య సాయితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన 11 నెలల కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అనంతరం పాపతో కలిసి పోలవరంలో కాలువలో దూకగా చిన్నారి మరణించింది. మణికంఠ ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
WGL: దుగ్గొండి (M) కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సాయంత్రం డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి అయ్యే విధంగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
WGL: దుగ్గొండి (M) కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సాయంత్రం డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి అయ్యే విధంగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపై కన్నడ హీరో రిషబ్ శెట్టి స్పందన చర్చనీయాంశంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో రిషబ్ పాల్గొనగా.. విజయ్, రష్మిక పెళ్లిపై ప్రశ్నించగా.. స్పందించకుండా ఆ ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. కాగా రిషబ్ శెట్టి స్నేహితుడు రక్షిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్మెంట్ రద్దయిన సంగతి తెలిసిందే. అందుకే రష్మిక వివాహం పై అతడు స్పందించలేదని టాక్ నడుస్తోంది.
TPT: తల్లంపాడు నుంచి సూళ్లూరుపేటకు వచ్చే ప్రధాన వాటర్ పైపైలైన్ పగిలిపోయింది. ఈ క్రమంలో సూళ్లూరుపేటలో శనివారం నీటి సరఫరా నిలిచిపోనుంది. బజార్ వీధి నుంచి పోస్ట్ ఆఫీస్ మీదుగా బొగ్గుల కాలనీ వరకు నీటి సరఫరా ఉండదు. పనులు పూర్తయ్యే వరకు ప్రజలు నీటిని మితంగా వినియోగించుకోవాలని కమిషనర్ చిన్నయ్య కోరారు.
NDL: కొలిమిగుండ్ల మండలంలోని అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన జూటూరు పుష్పావతి(40) కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటలకు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు.