TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషి గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
ELR: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని విజయవాడలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు రైతాంగ, కోకో పంటల రైతుల అంశాలపై మంత్రితో చర్చించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ గుత్తా అనిల్ పాల్గొన్నారు.
NTR: నందిగామలోని కంచికచర్ల మార్కెట్ యార్డ్‌లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ కోగంటి బాబు బుధవారం ప్రారంభించారు. వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో రైతులు అధికంగా శనగలు సాగు చేసినందున నష్టపోకుండా ఉండేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఉద్దేశం రైతులకు మద్దతుగా నిలబడమే అని ఆయన అన్నారు.
అన్నమయ్య: పుంగనూరు(మం) పట్రపల్లిలో నెల్లి, అల్లనేరేడు తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రిప్ పైపులు, కేబులు దగ్ధమవగా సుమారు రూ.1.5 లక్షల నష్టం జరిగినట్లు పోలీసుల అంచనా. ధూమపానం ముక్కల వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తోటకు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో అప్రమత్తం చేశారు.
SKLM: జిల్లా పరిధిలో మార్చి 2న జరగాల్సిన డాక్టర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ప్రవేశ పరీక్ష మార్చి 8కి వాయిదా పడిందని నందిగాం బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ బెలమర మంజుల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-28 విద్యా సంవత్సరానికి 6, 7 ,8 ,9 10 తరగతుల విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు 9177788124 సంప్రదించాలన్నారు
KNR: పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార అహంకారంతో మావోయిస్టులను అంతం చేస్తామని హెచ్చరికలు చేయడం సరికాదని CPI సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని అంతం చేయడం సాధ్యం కాదని ఆకలి, అణిచివేత ఉన్నంత వరకు విప్లవం ఉంటుందని పేర్కొన్నారు.
కర్నూలు: జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాపర్టీ కేసులలో పోలీసులు బాగా పని చేయాలని సూచించారు.
ATP: అనంతపురం నగర పరిసరాల్లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసి యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసెంబ్లీలో కోరారు. బుధవారం సభలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగాలన్నారు. తక్కువ వేతనాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ పార్క్ ఎంతో దోహదపడుతుందని వివరించారు.
కామారెడ్డి జిల్లాలోనీ నాగిరెడ్డిపేట మండల సమాఖ్య ఏపీఎంగా వెంకటలక్ష్మీ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎల్లారెడ్డి ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని వెంకటలక్ష్మీ తెలిపారు.
TG: మెదక్‌లోని రామచంద్రాపురం కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద నిర్మాణంలో ఉన్న సర్వీస్ రోడ్డును ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. త్వరలోనే ప్రజలకు దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యమే ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దని పేర్కొన్నారు.
KDP: జెడ్‌పీహెచ్‌ఎస్‌ఎస్ మైదుకూరులో BFSI వృత్తి విద్యలో భాగంగా విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వైఎస్ఆర్‌నగర్ శాఖలో పారిశ్రామిక సందర్శన నిర్వహించారు. శాఖ మేనేజర్ పీ. శర్మిల విద్యార్థులకు బ్యాంక్ పనితీరు, ఖాతా ప్రారంభం, రుణాల ప్రక్రియ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై వివరించారు.
SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు బడా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని ‘X’ వేదికగా విమర్శించారు. రైతుల కన్నీళ్లతో పాలన సాగించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని హితవు పలికారు.అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్నారని వెంటనే రైతుబంధు విడుదల చేయాలన్నారు
ATP: ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల మండల విద్యాశాఖ అధికారుల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. కొర్రపాడు, బుక్కరాయసముద్రం కేంద్రాల్లో నిర్వహించిన ఈ సదస్సులో కేపాసిటీ బిల్డింగ్, ఎఫ్ఎల్ఎన్ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎంఈఓలు, డైట్ అధ్యాపకులు ఇందులో పాల్గొన్నారు.
VZM: ముఖ్యమంత్రి ప్రజావేదికకు పక్కా ఏర్పాట్లు చేయాలని అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి విరించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు
ప్రకాశం: మార్కాపురం జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. మార్కాపురంలో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి రూ.50 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు లేకుండా రక్షిత మంచి నీరు ఇస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తానని, వెలిగొండ్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు.