KRNL: హోలీ పండుగ సందర్భంగా కర్నూలు మార్కెట్ కమిటీ యార్డుకు నేడు సెలవు ప్రకటించామని, రైతులు అమ్మకానికి తమ పంట ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. బుధవారం యథావిధిగా మార్కెట్ కమిటీ యార్డులో పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతాయన్నారు.
SRPT: గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో భారీ దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన బత్తిని సైదమ్మ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని ఐదు తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
NZB: కమ్మర్‌పల్లి మండలం కోన సముందర్‌లో సోమవారం సర్పంచ్ రాకేశ్ ఆధ్వర్యంలో వీధుల వారీగా దోమల మందు పిచికారి చేయించారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామన్నారు. పరిసరాలను మాతో పాటు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం వైపు అడుగులు వేస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
NLR: సంగం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన మెడలోని 13 సవర్ల బంగారు సరుడు పోయిందని స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వివరాలు.. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన జ్యోతి నెల్లూరులో ఉంటుంది. సోమవారం తమ ఊరికి వెళ్లేందుకు నెల్లూరు నుంచి పొదలకూరు బస్సుకు వెళ్లే క్రమంలో తన మెడలో నగ కనిపించకపోయిందని వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం సాయంత్రం లారీ-కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు సహాయంతో 108 వాహనంలో మెరుగైన చికిత్స నిమిత్తం కొవ్వూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వక్తృత్వ పోటీల పోస్టర్లను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సోమవారం ఆవిష్కరించారు. ఈ పోటీలు మార్చి 4 నుంచి ప్రభుత్వ మహిళా కళాశాల ఆధ్వర్యంలో జరుగుతాయని ఆమె తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు ‘మై భారత్’ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: కంకిపాడు రైతు బజార్లో మంగళవారం కూరగాయల ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. కాప్సికంకు రూ.57తో అత్యధిక ధర పలికింది. ఫ్రెంచ్‌బీన్స్ రూ.51, క్యారెట్ రూ.27గా నమోదు కాగా, టమాటా రూ.12, బీరకాయ రూ.20గా విక్రయమయ్యాయి. పచ్చిమిర్చి రూ.33, వంగ రూ.14-16 వరకు లభించగా, దొండ రూ.22, బెండ రూ.18గా ఉన్నాయి. బంగాళాదుంప, బీట్‌రూట్, ఉల్లిపాయలు రూ.23, దోసకాయ రూ.20గా ఉన్నాయి.
AP: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విశాఖ-అబుధాబి మధ్య విమాన సర్వీసులు రద్దయ్యాయి. వైజాగ్ నుంచి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో అబుదాబికి విమాన సర్వీసులు నడుస్తాయి. నిత్యం సుమారు 170 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఆది, సోమవారాల్లో సర్వీసులు నిలిచిపోయాయి. బుధవారం కూడా సర్వీసులు రద్దయినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
కోనసీమ: రామచంద్రపురం పట్టణం, మండల పరిధిలోని ఓదూరు, నరసాపురపుపేట తదితర గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. రూ.1.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
AP: రాష్ట్రంలో గుంతలమయంగా మారిన 4,158.10 కి.మీ. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.514.50 కోట్లు మంజూరు చేసింది. 3,220.85 కి.మీ. మేర 655 జిల్లా రోడ్ల మరమ్మతులకు రూ.356.52 కోట్లు, 937.25 కి.మీ. మేర 202 రాష్ట్ర రహదారులకు రూ.143.48 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
VZM: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. APNRTS కో-ఆర్జినేటర్ల ద్వారా బాధితులకు ఇప్పటికే తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని, బాధితులందరినీ త్వరలోనే స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అధికారులను సంప్రదించాలన్నారు.
SDPT: జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం డప్పు చప్పుళ్ల మధ్య ఇంటింటికీ తిరుగుతూ ఆవు పేడ పిడకలు, మొక్కజొన్న కంకి బెండ్లను సేకరించారు. ప్రధాన కూడళ్లలో కాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, సంప్రదాయబద్ధంగా దహనం చేశారు. మంగళవారం రంగుల కేళి జరుపుకునేందుకు గ్రామీణులు ఉత్సాహంగా సిద్ధమయ్యారు.
TG: టమాటా ధర భారీగా పతనమైంది. వ్యాపారులు కిలోకు రూ.4 కూడా పెట్టడం లేదు. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండడంతో ధర పడిపోయింది. దీంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు టమాటాలను ఫ్రీగా జనాలకు పంచుతున్నారు.
HYD: హోలీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇవాళ మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలని సీపీ సజ్జనార్ ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
WGL: రాయపర్తి మండలం మైలారం చెందిన రిటైర్డ్ ఎస్సై లేతకుల బుచ్చి రెడ్డి (61) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. 1984లో కానిస్టేబుల్‌గా చేరి సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన 2026 జనవరిలో కేయూ స్టేషన్ ఎస్సైగా పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ ప్రయోజనాలు, పింఛన్ సెటిల్‌మెంట్ ఆలస్యం కావడంతో మానసిక ఆందోళనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.