బ్లడ్ క్యాన్సర్‌లో ఎక్కువగా కనిపించే లక్షణాల్లో నిరంతర అలసట. రెస్ట్ తీసుకున్నా శరీరం బలహీనంగా అనిపించడం. తరచూ జ్వరం రావడం, బరువు తగ్గిపోవడం, రాత్రి సమయంలో ఎక్కువగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం. తరచూ ఇన్ఫెక్షన్లు రావడం బ్లడ్ క్యాన్సర్‌కు ముఖ్యమైన సంకేతం. ఈ వ్యాధి వల్ల శరీరంలోని తెల్ల రక్తకణాల పనితీరు దెబ్బతింటుంది.
చాలామంది బరువు తగ్గడానికి, ఫిట్‌నెస్ కోసం పరగడుపున నిమ్మరసం తాగుతారు. అయితే, ఖాళీ కడుపుతో తాగితే అందరికీ మేలు జరగకపోగా, కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎసిడిటీ సమస్య ఎక్కువ అవుతుంది. కొందరి జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు తాగినప్పుడు పొట్టలో మలిపెట్టినట్లు ఉండటం, తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి వంటి అసౌకర్యాలు ఎదురవుతాయి.
వృశ్చికాసనం (స్కార్పియన్ పోజ్) యోగాలో అధునాతనమైన భంగిమ. శరీరాన్ని తేలు ఆకృతిలో మలిచి చేసే ఈ ఆసనం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంపై పూర్తి నియంత్రణ సాధించడంలో, బ్యాలెన్స్ మెరుగుపర్చడంలో పనిచేస్తుంది. భుజాలు, వెన్నెముక, తుంటి భాగాలను సాగదీస్తుంది. కండరాల దృఢత్వం తగ్గి వశ్యత పెరుగుతుంది. మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది. ఏకాగ్రత, మానసిక స్పష్టత పెరుగుతాయి.
ఎండ వేడిమి వల్ల డీహైడ్రేషన్, కడుపులో మంట వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో చల్లని పానీయం తాగాలి. అలాంటి పానీయాలలో సోంపు-బెల్లం షర్బత్ ఒకటి. ఇందులో సహజంగా శరీరాన్ని చల్లబరిచే గుణాలు అధికంగా ఉంటాయి. వేసవిలో వచ్చే కడుపులో మంట సమస్యలను సోంపుతో చేసిన పానీయాలు తాగితే ఉపశమనం పొందొచ్చు. ఇంకా పుదీనా, పటిక బెల్లం, నిమ్మరసం వంటి వాటిని కూడా ఇందులో వేసుకుంటే మంచిది.
ఈ రోజు ఏం చేయాలి అని కాదు, ఏ సమస్యలు పరిష్కరించాలి అని ఆలోచించండి. మీరు ఎన్ని ఎక్కువ సమస్యలను పరిష్కరిస్తారో, సమాజంలో అంత ఎక్కువ విలువను సృష్టిస్తారు. ఫలితంగా మీ వ్యక్తిగత విలువ, గుర్తింపు కూడా పెరుగుతాయి. సమస్యలను ఎదుర్కొని పరిష్కారం చూపడమే మీ ఎదుగుదలకు అసలైన బాట.
రోజూ కిలోమీటరు వాకింగ్ చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నడిచేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ హార్మోన్లు విడుదలవుతాయి. మనసుకు ప్రశాంతతను కలిగించి ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట, నిద్రలేమి సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్యలు తగ్గి జీవక్రియ వేగవంతమవుతుంది.
యోగనిద్రాసనం అనేది శారీరక, మానసిక ఒత్తిళ్లను తగ్గించి, గాఢమైన విశ్రాంతినిచ్చే అద్భుతమైన పద్ధతి. మెదడుపై భారాన్ని తగ్గించి, నెగెటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. నిద్రలేమి సమస్యను దూరం చేసి, గాఢమైన నిద్రను పట్టేలా చేస్తుంది. 20 నిమిషాల యోగ నిద్ర.. దాదాపు 2 గంటల సాధారణ గాఢ నిద్రతో సమానమైన విశ్రాంతిని ఇస్తుంది.
భారత్ తీవ్ర ‘ద్వంద్వ ఆరోగ్య ముప్పు’ను (ఊబకాయం, పోషకాహార లోపం) ఎదుర్కొంటోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్నారని తెలిపింది. జీవనశైలి వ్యాధులు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయని పేర్కొంది. 2023-24లో 715 జిల్లాల్లోని 6.79 లక్షల ఇళ్లలో కేంద్రం ఈ సర్వే నిర్వహించింది.
శరీరంలోని శక్తి మాటల రూపంలో వృథా కాకుండా కాపాడుకోవడమే మౌన వ్రతం ముఖ్య ఉద్దేశం. మౌనం అంటే మాట్లాడకపోవడమే కాదు మనసులోని ఆలోచనలను నిశ్శబ్దం చేయడం. ఇది ఒత్తిడిని, కోపాన్ని తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే మెదడుకు విశ్రాంతినిస్తూ మనోబలాన్ని, ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది.
జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే క్యాన్సర్ వచ్చిందేమోనని చాలా మంది భయపడుతుంటారు. అయితే ఇది కేవలం అపోహేనని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రాలుతుందట. క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ వల్ల మాత్రమే తాత్కాలికంగా జుట్టు ఊడుతుంది కానీ, సాధారణంగా జుట్టు రాలడానికి క్యాన్సర్ వ్యాధికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మగవారు రోజూ ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట గ్లాస్ నీటిలో చెంచా జీలకర్ర నానబెట్టి, ఉదయం వడకట్టి తాగాలి. ఇది వేసవిలో శరీరానికి చలవ చేస్తుంది. వారం రోజుల పాటు తాగితే పురుషుల్లో జీర్ణక్రియ మెరుగై ఎసిడిటీ, కడుపునొప్పి, ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి.
ఉదయాన్నే లేవడానికి బద్ధకించే వారి కోసం జపనీస్ యువత ‘కైజెన్’ (వన్ మినిట్ రూల్) పాటిస్తారు. రోజుకు కేవలం ఒకే ఒక్క నిమిషం పాటు ఒక పుష్-అప్ చేయడం, ఒక వాక్యం చదవడం లేదా ధ్యానం లాంటి చిన్న పనులతో రోజును ప్రారంభించడమే ఈ పద్ధతి. దీనివల్ల క్రమశిక్షణ పెరిగి బద్ధకాన్ని సులువుగా వదిలించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొందరికి వంకాయ కూర తింటే వెంటనే దురద పెడుతుంది. అలాగే, శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారిలో జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. వీటిని తిన్న తర్వాత వంకాయల్లో ఉండే ఫైబర్ కడుపు నొప్పి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. వంకాయలో ఆక్సలేట్లు ఎక్కువ ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు అస్సలు టచ్ చేయకూడదు. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు వీటిని తినొద్దు.
వీరభద్రాసనం (వారియర్ పోజ్) క్రమం తప్పకుండా చేస్తే శారీరకంగా, మానసికంగా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. చేతులు, భుజాలు, తొడలు, పిరుదులు, చీలమండల కండరాలు బలపడతాయి. శరీరం యొక్క సమతుల్యతను, స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీని విస్తరింపజేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి, శ్వాసవ్యవస్థ మెరుగుపడుతుంది.
శారీరక, మానసిక ఆరోగ్యానికి రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల చిరాకు, ఏకాగ్రత తగ్గడం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పడుకోవడానికి గంట ముందే ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం, గదిని ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది.