SKLM: ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు టీడీపీ రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్‌గా ఎంపిక అయ్యారు. ఈ మేరకు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఎంపిక పట్ల ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు MLAకు అభినందనలు తెలిపారు.
సత్యసాయి: కదిరి రూరల్ కుమ్మరమండ్లపల్లి పేలుడు ఘటనలో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. గాయపడిన వారికి ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించి అండగా నిలిచారు.
BPT: కుటుంబ విభేదాలతో ఇంటి నుంచి వెళ్లిన తల్లి, నలుగురు పిల్లలను పర్చూరు పోలీసులు గుర్తించారు. ఎస్సై పులి గోపి కేసు నమోదు చేసి గాలింపు చేపట్టగా.. డీఎస్పీ చంద్రమౌళి పర్యవేక్షణలో బృందాలు కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద వారిని సురక్షితంగా గుర్తించి తిరిగి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అనంతరం కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
పల్నాడు: పెడకూరపాడు మండలం హుస్సేన్ నగర్‌లో బుధవారం రాత్రి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ 62వ ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ రోజు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
TPT: నాగలాపురం మండలంలోని శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో మే 1 నుంచి 9 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని జేఈఓ వీరబద్రం ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు, క్యూలైన్లు, అన్నప్రసాదం వంటి ఏర్పాట్లు మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
అనకాపల్లి: మాకవరపాలెం మండల ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జయ మల్లేశ్వరి మండల టాపర్‌గా నిలిచింది. ఎంపీసీ గ్రూపులో ఆమె 1000కి 972 మార్కులు సాధించింది. కేజీబీవీ ప్రత్యేక అధికారి త్రివేణి తెలిపిన వివరాల ప్రకారం కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషంగా నిలిచింది. మల్లేశ్వరి పలువురు అభినందిస్తున్నారు.
అనకాపల్లి: గవరపాలెం ప్రాంతానికి చెందిన విషకోటి రజని తన బంధువుల పెళ్లికి సంబంధించిన బట్టలు, విలువైన వస్తువులను ఆటోలో మర్చిపోయారు. తలుపులమ్మ ఆటో స్టాండ్‌కు చెందిన డ్రైవర్ రాజేశ్ వాటిని గుర్తించి భద్రంగా ఉంచి, పోలీస్ స్టేషన్‌లో బాధితురాలికి అప్పగించారు. డ్రైవర్ నిజాయితీకి స్థానికులు ప్రశంసలు తెలిపారు.
KKD: ఇంటర్ మీడియట్- 2026 పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లాలోని ఫస్ట్ ఇయర్‌లో 77 శాతం, సెకండ్ ఇయర్‌లో 81 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా విభాగం అధికారి వి. కేశవరావు పేర్కొన్నారు. కాకినాడ కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. మే 12న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ELR: నేర నియంత్రణలో సాంకేతికతను ఆయుధంగా మలుచుకోవాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలీసు సిబ్బందికి సూచించారు. బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. తప్పిపోయిన పిల్లల గుర్తింపు, గుర్తుతెలియని మృతదేహాల ఆచూకీ కోసం ఆధునిక సాఫ్ట్‌వేర్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.
ATP: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్ షేక్ షమీర్‌ను అనంతపురం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఇతను తిరిగి దాడులకు తెగబడటంతో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిబంధనలు మీరినందుకు జడ్జి ఏడు రోజుల రిమాండ్ విధించడంతో నిందితుడిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.
NLR: జిల్లాలో గ్రంథాలయ సంస్థ సెస్ బకాయిలపై బుధవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఛైర్ పర్సన్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు కార్పొరేషన్ రూ.10 కోట్లు, కావలి 50 లక్షలు, గూడూరు, నాయుడుపేట చెరో 40 లక్షలు, ఆత్మకూరు 30 లక్షలు, వెంకటగిరి 35 లక్షలు, బుచ్చి 20 లక్షలు, అల్లూరు 7 లక్షల చొప్పున బకాయిలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ ఆదేశించారు.
కోనసీమ: రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శిగా నియమితులైన కోన వెంకట శ్రీనివాసరావు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న తప్పుడు కేసుల నుంచి కార్యకర్తలకు న్యాయపరమైన రక్షణ కల్పించి, వారిలో భరోసా నింపాలని శ్రీనివాసరావుకు దిశానిర్దేశం చేశారు.
KRNL: ఆదోనిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 42 గ్రామాల అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర నిధులతో అంగన్వాడీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తల్లి, శిశువులకు నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు.
KRNL: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయిని జిల్లా ఉపాధి అధికారి దీప్తి పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత గల 18-30 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చని సర్టిఫికెట్లు, ఫోటోలు తీసుకురావాలని ఆమె వెల్లడించారు.
CTR: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో 623 పంచాయతీల్లోని 5,914 వార్డుల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్టు డీపీవో సుధాకర్ రావు పేర్కొన్నారు. అందులో పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది, ఇతరులు 27 మంది ఉన్నారని వెల్లడించారు.