కర్నూలులో 10వ రక్షణ దళాల వెటరన్స్ డే సందర్భంగా శనివారం ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారి శివ హరి నాయక్ తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టీజీ లక్ష్మి కళ్యాణ మండపం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాజీ సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు వేగవంతమైంది. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని 9.84 ఎకరాల భూమిని 25 ఏళ్ల లీజుకు ఇస్తూ అనుమతులు లభించాయి. కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ మద్దతుతో తొలి విడతగా రూ. 298.03 లక్షలు విడుదలయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా డిజైన్ స్టూడియో, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించనున్నారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 28న ఉదయం బాలాలయ ప్రతిష్టాపన నిర్వహించినట్లు ఆలయ ఈవో విజయ రాజు శుక్రవారం తెలిపారు. దేవస్థానంలో నూతన ధర్మాలయం మండపాలను పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గర్భాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు బాలాలయంలోని స్వామివారికి పూజలు జరుగుతాయన్నారు.
కడప జిల్లా ఎర్రగుంట్లలో దాదాపు రూ.2 కోట్లకు పైగా నగదు తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం అతను ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన బంగారు వ్యాపారస్థుడని తెలుస్తోంది. నగదు మూలం ఏమిటి, సంబంధిత బిల్లులు చూపించాలని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
NDL: బేతంచర్ల మండలం సీతారామపురం మెట్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సంజీవ నగర్ కాలనీకి చెందిన కూలీలు చామంతి పూలు కోయడానికి ఆటోలో వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మధుకు తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
SKLM: పోలాకి మండలం చెల్లాయివలస గ్రామానికి చెందిన మట్ట రామయ్య ఇటీవల స్వర్గస్తులయ్యారు. వారి కుటుంబ సభ్యులను యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేస్తూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో పాటు మండల వైసీపీ అధ్యక్షులు కృష్ణారావు, రాష్ట్ర యువజన కార్యదర్శి రాఘవరావు, తదితరులు ఉన్నారు.
W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువులో శుక్రవారం ‘ఫ్రైడే -డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని తొలగించి, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ASR: ఆల్ ఇండియా సైకిల్ యాత్ర చేస్తున్న ముగ్గురు యువకులు శుక్రవారం డుంబ్రిగుడలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. కడపకు చెందిన మనోజ్, మహబూబ్‌నగర్‌కు చెందిన విక్రమ్, బిహార్‌కు చెందిన బిక్కూ పటేల్ 16 రోజుల క్రితం హైదరాబాద్‌లో యాత్ర ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పర్యటించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ యాత్రను పూర్తి చేయడానికి ఇంకా 45 రోజులు పడుతుందని తెలిపారు.
VZM : నేటి యువత భాషా సాహిత్యాలు అలవర్చుకోవాలని ప్రధాన వక్త మేడూరి సత్యనారాయణమూర్తి అన్నారు. గజపతినగరంలో లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో భాగవతంలోని రుక్మిణి కళ్యాణం అనే అంశంపై చైతన్య భారతి ఏర్పాటుచేసిన సభలో శుక్రవారం ప్రసంగించారు. సభకు చైతన్య భారతి అధ్యక్షులు బుద్ధరాజు వెంకట శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది.
BPT: కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో రేపు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మొత్తం 7,696 మంది లబ్ధిదారులకు రూ.3.31 కోట్లు అందించనున్నారు. దీనికోసం 159 మంది సిబ్బందిని నియమించారు. వీరు ఉదయం 6.30 గంటల నుంచే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తారు. అందరికీ నూరు శాతం పెన్షన్లు అందేలా చూడాలని MPDO శ్రీనివాసరావు అన్నారు.
AKP: దేమునిగుమ్మం శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని పెండ్లికుమారునిగా అలంకరించి గరుడ ఆల్వార్లకు పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించారు.
E.G: దేవరపల్లిలోని ఎస్సీ ఏరియాలో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా మంచి నీటి పైపుల చుట్టూ మురుగు నీరు కుంటల్లా పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రపరిచి, మంచినీటి సరఫరాను సక్రమంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
PLD: అమరావతి రాజధానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బుద్ధ విగ్రహానికి సరికొత్త మెరుగులు దిద్దుతున్నారు. విగ్రహంపై పాత రంగులు వెలిసిపోవడంతో, పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రభుత్వం ప్రత్యేక సుందరీకరణ పనులు చేపట్టింది. ఈ నూతన మెరుగులు విగ్రహానికి కొత్త శోభను చేకూర్చడమే కాకుండా, పర్యాటక ప్రాంతంగా అమరావతి వైభవాన్ని మరింత పెంచనున్నాయి.
W.G: ఏపీ రాష్ట్ర పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మార్చి 8న జరుగుతుందని ఆకివీడుకు చెందిన పద్మశాలి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు సప్పా మణికంఠ చెప్పారు. మార్చి 8 ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం, రాష్ట్ర యువజన సంఘం నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు.
సత్యసాయి: పరిగి మండల కేంద్రంలోని సీతారాంపురం కాలనీ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో తాగునీటి పైప్ లైన్‌కు లీకేజ్ ఏర్పడి మూడు రోజులుగా నీరు వృథాగా పారుతోంది. తాగునీటి కొరత ఒకవైపు ఉండగా, మరోవైపు ఇలా నీరు వృథా కావడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.