స్నేహమంటే చెరిగిపోనిది.. కష్టసుఖాల్లో కుటుంబసభ్యులు తోడు ఉన్నా లేకున్నా స్నేహితులు మాత్రం వెన్నంటే ఉంటారు. అలాంటి స్నేహితులు పొందిన వారికి ఏ కష్టం వచ్చినా ‘నా ఫ్రెండ్ ఉన్నాడు’ అనే భరోసాతో గట్టెక్కుతారు. అలాంటి స్నేహమే మనోజ్ మోదీ (Manoj Modi)- ముకేశ్ అంబానీలది (Mukesh Ambani). యూనివర్సిటీలో కలిగిన స్నేహం కంపెనీ అభివృద్ధిలో కూడా కలిసొచ్చింది. అంబానీ కుటుంబంలో ఓ సభ్యుడిగా మారిపోయిన వ్యక్తి మనోజ్ మోదీ. ముకేశ్ కు రైట్ హ్యాండ్ (Right Hand)గా మనోజ్ గుర్తింపు పొందాడు. తన కష్టనష్టాల్లో తోడుగా ఉన్న తన స్నేహితుడు మనోజ్ మోదీకి ముకేశ్ అంబానీ ఊహించని బహుమతి (Surprise Gift) ఇచ్చాడు. ఏకంగా రూ.1,500 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన భవంతిని (Building) కానుకగా ఇచ్చాడు.
ముంబై యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో (Mumbai’s University Department of Chemical Technology) ముకేశ్, మనోజ్ కలిసి చదువుకున్నారు. అనంతరం 1980లో ధీరూభాయ్ అంబానీ చైర్మన్ గా ఉన్నప్పుడు రిలయన్స్ కంపెనీలో మనోజ్ మోదీ చేరాడు. అప్పటి నుంచి నేటి వరకు ఆ కంపెనీలో పని చేస్తున్నాడు. ముకేశ్ అంబానీ వారసులకు తోడుగా మనోజ్ మోదీ నిలుస్తున్నాడు. రిలయన్స్ కంపెనీ సాధించిన అనేక విజయాల్లో మనోజ్ తోడు ఉన్నాడు. ప్రస్తుతం మనోజ్ మోదీ రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియోలో డైరెక్టర్ (Director at Reliance Retail and Reliance Jio)గా కొనసాగుతున్నాడు.
అంతటి గొప్ప స్నేహితుడికి ముకేశ్ అంబానీ రూ.1,500 కోట్ల భవంతిని మనోజ్ కు రాసిచ్చేశాడు. ముంబైలోని (Mumbai) నేపియన్ సీ రోడ్డులో (Nepean Sea Road) ఉన్న 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని (Luxury Building) మనోజ్ కు ముకేశ్ బహుమతిగా ఇచ్చాడు. దశాబ్దాలుగా తనతో ఉన్న స్నేహితుడికి ఇంతటి కానుక ఇచ్చాడని తెలిసి పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్క పరిశ్రమ రంగంలోనే కాదు సాధారణ ప్రజల్లోనూ వీరి దోస్తానాకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఎంత అపర కుబేరుడికైనా స్నేహం తోడు ఉంటుంది. ఎందరో స్నేహితుల సహకారంతో రిలయన్స్ ప్రపంచంలోనే అత్యంత మేటి కంపెనీగా నిలదొక్కుకుంది. దశాబ్దాల స్నేహానికి అపూర్వ కానుక ఇవ్వడంపై అందరూ ప్రశంసలు ముంచెత్తుతున్నారు.