IT Sector: ఒకప్పుడు ఉద్యోగం వస్తే చాలు ఇక జీవితాంతం బిందాస్ గా ఉండొచ్చు అని అందరూ అనుకునేవారు. ఇప్పుడు ఏ రంగంలోనూ ఆ గ్యారెంటీ ఉండటం లేదు. చేతికి వచ్చిన జీతం అయిపోయేలోపు…ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా అనే కంగారు ఎక్కువైపోయింది. తాజా సర్వేలో ఐటీ రంగంలో లేఆఫ్‌ల విషయంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
మన దేశంలోని ఐటీ రంగంలోని (IT Sector) అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిలో దాదాపు 6 శాతం మంది జనవరి- మార్చి మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారని ఒక సర్వేలో తేలింది. ప్రాజెక్టుల కోసం చాలా ఐటీ కంపెనీలు తాత్కాలికంగా సిబ్బందిని నియమిస్తారు. వారిని అవసరం లేనప్పుడు తొలగిస్తున్నారు.కాంట్రాక్టర్ల ద్వారా కంపెనీలు నియమించుకొనే ఉద్యోగుల సంఖ్య 7.7 శాతం తగ్గిపోయిందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ శుక్రవారం వెల్లడించింది. ఉద్యోగులు ఆఫీసుకొచ్చి పని చేయడంలో మందగమనం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ నుంచి ఐటీ ప్రాజెక్టులు తగ్గినట్టు తెలుస్తుందని ఫెడరేషన్ అధ్యక్షుడు లోహిత్ భాటియా వెల్లడించారు. 2022 మార్చి నాటికి దేశీయ ఐటీ రంగంలో దాదాపు 51 లక్షల మంది (51 lakh people) సిబ్బంది ఉన్నారు. కొత్త నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగిస్తుండటం గమనార్హం.
కోవిడ్ సమయంలో ఆన్ లైన్ కొనుగోళ్లు పెరగడం, ఇంటి నుంచి పని చేయడం, ఆన్ లైన్ తరగతుల వల్ల ఐటీ కంపెనీలకు మంచి ఆఫర్స్ ఉండేవి. కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో సిబ్బంది మళ్లీ ఆఫీసులకు వెళ్లడం మొదలుపెట్టారు. ఫలితంగా ఇంటి నుంచి చేసే ప్రాజెక్టులు కూడా తగ్గిపోయాయి. దీంతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నారు.