RK Roja: సిగ్గుండాలంటూ రోజాపై, ఆంబోతు అంటూ అంబటిపై ఫైర్
రాయలసీమ నీరు, వాటర్ ట్యాంకుకు సంబంధించి రోజా, నాగబాబుల మధ్య ఇటీవల ట్విట్టర్ (Twitter) యుద్ధం నడిచింది. ఈ అంశంపై నాగబాబుకు మద్దతుగా ఓ మహిళ... మంత్రి పైన దుమ్మెత్తిపోశారు. అంబటి రాంబాబు పర్యవేక్షణలో రోజా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు... నగరికి వైయస్సార్ పోలవరం అంటూ ఎద్దేవా చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా (RK Roja) నిండ్ర మండలంలో రూ.11 లక్షల నిధులతో మంజూరైన త్రాగునీటి బోరు, పైప్ లైన్‌ను ప్రారంభించడం, దానిపై జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు (Nagababu) కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. నాగబాబుకు తిరిగి రోజా కూడా జవాబిచ్చారు. వీరి మధ్య ట్విట్టర్ (Twitter) యుద్ధం నడిచింది. అయితే ఈ అంశంపై నాగబాబుకు మద్దతుగా ఓ మహిళ… మంత్రి పైన దుమ్మెత్తిపోశారు. అంబటి రాంబాబు పర్యవేక్షణలో రోజా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు… నగరికి వైయస్సార్ పోలవరం అంటూ ఎద్దేవా చేశారు.
సిగ్గుండాలంటూ రోజాపై నిప్పులు
రోజాగారు చిత్తూరులో ప్రారంభించిన అతిపెద్ద ప్రాజెక్టు వైయస్సార్ పోలవరంను ప్రశంసిస్తూ కావొచ్చు లేదా ఆమెకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాయలసీమలో నీటి కొరత ఉంది.. దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అవసరం ఉంది.. 33 లక్షల మందికి తాగునీరు అవసరం ఉందని నాగబాబు సూచించారు. రోజా మాత్రం కేవలం చిన్న ట్యాంకును కట్టి ఏదో పెద్ద ప్రాజెక్టు కట్టినట్లుగా బిల్డప్ ఇచ్చారని అభిప్రాయపడ్డారు. సీమ ప్రాంతంలో నాగబాబు పర్యటించారని, అక్కడి ప్రజల సమస్యలు విన్నారని, అందుకే ఆయన వాటిని మీ దృష్టికి ట్వీట్ ద్వారా తీసుకు వచ్చారని గుర్తు చేశారు. కానీ రోజాకు చిత్తూరు, రాయలసీమ గురించి ఏమీ తెలియదని, ఎనిమిదన్నరేళ్లుగా ఎమ్మెల్యేగా, మూడున్నరేళ్లుగా మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. అక్కడ ఓ చిన్న ట్యాంకును నిర్మించారని, దానికి మహా అయితే రూ.5వేలు అవుతుందేమో… అలాగే ఎక్కడి నుండో పైప్ లాగి తీసుకు వచ్చారట, పైగా దానికి రూ.11 లక్షలు శాంక్షన్ చేయించుకున్నట్లు చెప్పారని తెలిపారు. ఆ బుల్లి ట్యాంకు నుండి ఓ గ్రామానికి నీరు ఇచ్చింది. ఈ చిన్న దానికి షేక్ హ్యాండ్స్, ఎలివేషన్ సాంగ్స్, పేటీఎం కార్యకర్తల భజనలు అవసరమా అని ప్రశ్నించారు.
ఇంత చిన్న పనికి ఎంతో బిల్డప్ ఇచ్చారని, దీనిని నాగబాబు ప్రశ్నిస్తే గాడిదకు ఏం తెలుసు గంధం విలువ అంటోందని, కానీ అలా అనాలనుకుంటే మేం కూడా పందికేం తెలుసు పాండ్స్ వాసన అనగలమని మండిపడ్డారు. అసలు ఆ బుల్లి ట్యాంక్‌లోని నీళ్లు.. రోజా వేసుకున్న మేకప్ తొలగించేందుకు సరిపోదని ఎద్దేవా చేశారు. అలాంటి ట్యాంకును ఏదో సుజల స్రవంతి ప్రాజెక్టులో బిల్డప్ ఏమిటన్నారు. బహుశా ఆంబోతు అన్నయ్య ఇచ్చిన డైలాగ్ కావొచ్చునని మంత్రి అంబటి రాంబాబును (Ambati Rambabu) ఉద్దేశించి అన్నారు. చెల్లీ… ఎలాగు మనం పోలవరంను కట్టలేము.. నువ్వే అక్కడ వైయస్సార్ పోలవరం కట్టెయ్ అని సూచించి ఉంటాడన్నారు. అప్పుడు పోలవరం కట్టాం చూడు అని పాడుకుంటూ… జారుమిటాయ్ పాటలా మనం ఫేమస్ కావొచ్చునని చెప్పి ఉంటాడేమో అన్నారు.
ఎనిమిదిన్నరేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజా ఈ చిన్న పనికి అంతలా బిల్డప్ ఇవ్వడానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. నాగబాబు లేవనెత్తిన సమస్యలను కనీసం సీఎం జగన్ (YS Jagan) దృష్టికి లేదా అంబటి దృష్టికి తీసుకు వెళ్తే బాగుండేదన్నారు. కనీసం నగరి ప్రజల దాహార్తిని తీర్చే ప్రయత్నం చేయాలని సూచించారు.
అసలేం జరిగింది?
పది రోజుల క్రితం నిండ్ర మండలంలో రోజా రూ.11 లక్షలతో నిర్మించిన చిన్న వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఈ చిన్న దానికి భారీ బిల్డప్ ఇచ్చారనేది నాగబాబు వాదన. అందుకే నాలుగు రోజుల తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన రోజా
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా!
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం.’
అంటూ రోజాను ట్యాగ్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పైన స్పందించిన రోజా.. నాగబాబును ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు.
‘ఆ గ్రామ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. సుదూర ప్రాంతం నుండి పైప్ లైన్ లాగి తాగునీటినిచ్చాము.
గాడిదకేమి తెలుసు గంధపు వాసన, నేను కాబట్టి ఇదిగో వివరాలు చూపిస్తున్నా, ఆ గ్రామానికి వెళ్ళి ఈ వెటకారం మాటలు మాట్లాడి చూడు తగిన రీతిలో చెప్తారు గుణపాఠం!’ అంటూ పేర్కొన్నారు. దీనిపై నాగబాబుకు మద్దతుగా ఆమె స్పందించారు.