»Who Alert Marburg Virus Disease Outbreaks In Equatorial Guinea
MVD మరో వైరస్ ముంచుకొస్తోంది.. ఇప్పటికే 9 మంది మృతి
కరోనా మహమ్మారి సృష్టించిన విస్ఫోటనం నుంచి మానవ జాతి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కరోనా భయానకం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో వైరస్ వణికిస్తోంది. భూమికి మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. ఆ వైరస్ పేరు మార్ బర్గ్ వైరస్ డిసీ (Marburg Virus Disease- MVD). ఈ వైరస్ ఇప్పటికే మానవ జాతికి సోకింది.
కరోనా మహమ్మారి సృష్టించిన విస్ఫోటనం నుంచి మానవ జాతి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కరోనా భయానకం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో వైరస్ వణికిస్తోంది. భూమికి మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. ఆ వైరస్ పేరు మార్ బర్గ్ వైరస్ డిసీ (Marburg Virus Disease- MVD). ఈ వైరస్ ఇప్పటికే మానవ జాతికి సోకింది. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఈక్వటోరియల్ గినియాలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇఫ్పటికే 9 మంది ఈ వైరస్ బారినపడి మృతి చెందారు. ఈ వైరస్ వెలుగులోకి రావడం ఇది తొలిసారి కాదు. 1967లో ఎంవీడీ వైరస్ కనిపించింది.
ఎబోలాను పోలి ఉండే ఈ ప్రాణాంతక వైరస్ కు ఇప్పటి దాకా చికిత్స లేదు. గినియాలోని కీటెం ప్రావిన్స్ లో ఈ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడి 9 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ‘మృతి చెందిన వారందరిలో గుర్తు తెలియని హెమరేజ్ జ్వరం లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా మార్ బర్గ్ సోకినట్టు అనుమానం ఉన్న దాదాపు 200 మందిని క్వారంటైన్ తరలించాం’ అని డబ్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పొరుగు దేశం కామెరూన్ సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించారు.
వైరస్ లక్షణాలు
విపరీతమైన జ్వరం
తీవ్రమైన తలనొప్పి
ఆయాసం
రక్తపు వాంతులు
విరేచనాలు
కండరాల నొప్పులు
వైరస్ సోకిన వారిలో లక్షణాలు
– మొదట తలనొప్పి, జ్వరం వస్తుంది.
– మూడో రోజుకు పొత్తి కడుపు నొప్పి, విరేచనాలు అవుతాయి.
– వారం రోజులకు రక్తపు వాంతులు మొదలవుతాయి.
– కళ్లన్నీ లోపలికి పోయి మనిషి అకస్మాత్తుగా బలహీనంగా మారుతాడు.
– దీని ప్రభావంతో కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
– వెంటనే ఆస్పత్రిలో చేర్పిస్తే కోలుకునే అవకాశం ఉంది. లేకుంటే ప్రాణాంతకంగా మారుతుంది.
– ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదు. కానీ నివారణ మార్గాలు ఉన్నాయి. ఈ వైరస్ పై వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి.
వైరస్ తీవ్రత
– ఎంవీడీ సోకితే రక్తస్రావంతో కూడిన తీవ్ర జ్వరం వస్తుంది. ఈ వైరస్ సోకిన వారు 88 శాతం మంది చనిపోతున్నారు.
– 1967లో జర్మనీ, సెర్బియా దేశాల్లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది.
– ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ గ్రీన్ కోతుల ద్వారా ఈ వైరస్ వ్యాపించినట్లు అప్పుడు గుర్తించారు.
– గుహలు, గనుల్లో చాలాకాలం పాటు గడిపితే ఈ వైరస్ సోకుతుంది.
– ఈ వైరస్ అంటువ్యాధి లాంటిది. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి మొత్తం చుట్టేస్తుంది. తీవ్రంగా వ్యాపించే లక్షణం ఉంది.
ఈ వైరస్ వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. వైరస్ నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు తయారీ దశలో ఉన్నాయి. అవి ఇంకా ప్రయోగ దశకు చేరుకోలేదు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి మొదలవడంతో వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని డబ్ల్యూహెచ్ఓ ఆదేశిస్తోంది. కాగా ఏ వైరస్ వ్యాపించినా.. వ్యాపించకపోయినా మనం స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శుభ్రత, సమయానికి తిండి, నిద్ర ఉంటే ఎలాంటి వైరస్ లు దరిచేరవని చెబుతున్నారు.