MLC Kavitha ఇల్లు చక్కబెట్టాం.. ఇక దేశాన్ని చక్కదిద్దుతాం
గంగా జమున తహసీబ్ తరహాలో అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది. అన్ని మతాల పండుగలను ప్రజలు సంతోషంగా చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘం నాయకులు కవితకు వినతిపత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు.
ముందుగా ఇల్లు చక్కదిద్దుకున్నామని.. ఇప్పుడు దేశాన్ని కూడా చక్కదిద్దుతామని తెలంగాణ (Telangana) ఎమ్మెల్సీ, భారత్ జాగృతి (Bharat Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. స్వరాష్ట్రాన్ని సాధించి.. సాధించిన తెలంగాణను అభివృద్ధి చేసుకుని దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. ఇక దేశం స్థితిగతులు మార్చేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అందుకే ఇల్లు చక్కదిద్దుకున్నామని.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ద్వారా దేశాన్ని చక్కదిద్దుతామని చెప్పారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లో దళిత క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని వెస్లీ కళాశాలలో సీఎం కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం
‘సీఎం కేసీఆర్ (KCR) అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ఎక్కడా ఎలాంటి మత ఘర్షణలు చోటుచేసుకోలేదు. దళిత క్రైస్తవులకు సీఎం కేసీఆర్ రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారు. భవిష్యత్ లో మరింత మందికి అవకాశం కల్పిస్తారు. గంగా జమున తహసీబ్ తరహాలో అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది. అన్ని మతాల పండుగలను ప్రజలు సంతోషంగా చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలకు ప్రభుత్వం కానుకలు అందిస్తోంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళిత క్రైస్తవులు అండగా ఉన్నారు. వారి పాత్ర మరువలేనిది. రాష్ట్ర సాధన కోసం శాంతియాత్రలు చేసి చర్చిలను బంద్ చేసి పోరాటం చేశారు’ అని కవిత తెలిపారు. అంబేడ్కర్ మనవడు డాక్టర్ రాజారత్నం అంబేడ్కర్ మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులు ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అప్పుడే రాజ్యాధికారం సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మత పెద్దలు ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి
మరో కార్యక్రమంలో కవిత తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) క్యాలెండర్, డైరీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ, స్నేహపూర్వక ప్రభుత్వం అని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు సరైన సమయంలో ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘం నాయకులు కవితకు వినతిపత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు.