ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నప్పటికీ ఎవరు కూడా మాతృభాషను విస్మరించకూడదని వెంకయ్య నాయుడు సూచించారు. మాతృభాషను ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలన్నారు. తెలుగు భాషను తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో మహాత్మా గాంధీ రోడ్ను ఎంజీ రోడ్ అనడం దురదృష్టకరం అన్నారు. ఈ రోడ్డును మహాత్మా గాంధీ రోడ్డుగానే పిలవాలని కోరారు. దేవాలయాల నిర్మాణం పైన కూడా స్పందించారు. ధర్మ రక్షణ కోసం, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్య కల్పన కోసం పూర్వికులు ఆలయాలు నిర్మించారని తెలిపారు. ధర్మాన్ని మనం రక్షిస్తే.. ధర్మం మనల్ని రక్షిస్తుందని అన్నారు. సూర్యుడు, వెలుతురును వినియోగించుకున్నన్ని రోజులు మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు. రాత్రి త్వరగా పడుకుని సూర్యోదయం వేళల్లో లేవాలన్నారు. సెల్ ఫోన్ అతిగా వినియోగిస్తే హెల్ ఫోన్ అవుతుందని, సెల్ ఫోన్ను పరిమితగా మాత్రమే వాడాలన్నారు. 80 శాతం పట్టణ ప్రాంతాల వారికే కరోనా సోకిందని, సూర్యరశ్మిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు. ప్రజలు ఆదాయాన్ని పెంచుకుని ఇతరులతో పంచుకుంటేనే ఆనందమన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని పిలుపునిచ్చారు. మంత్రాలు చదివి వాటి అర్థాన్ని తెలుగులో అర్థం చెప్పాలన్నారు.
అంతకుముందు వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ గోదావరిలో ఓ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యను రాజధాని గురించి ప్రశ్నించారు ఓ విద్యార్థి. అందుకు ఆయన స్పందిస్తూ… తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని రాజధాని ఏర్పాటు అనేది ప్రజాభిప్రాయం ప్రకారమే జరగాలన్నారు. అమరావతిపై తన అభిప్రాయం ముందే చెప్పానని మరోసారి గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంతేకాదు అమరావతి అభివృద్ధికి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.