»Tspsc Cancelled Assistant Engineer Exam After Question Paper Leak
TSPSC ఏఈ పరీక్ష రద్దు.. ప్రకంపనలు సృష్టిస్తున్న లీకేజీ
కమిషన్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అమ్మాయిల నంబర్లు సేకరించడం.. వారితో చనువుగా మాట్లాడి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలోనే అతడి ఫోన్ పరిశీలించగా. అతడి ఫోన్ లో యువతుల నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రశ్నాపత్రం లీకేజీ (Question Paper Leakage) వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) తీవ్రంగా స్పందించింది. లీకేజీకి పాల్పడ్డ నిందితులను ఆగమేఘాల మీద అరెస్ట్ చేయించింది. అనంతరం సంస్థాగత లోపాల (Internal Problems)పై దృష్టి సారించింది. అయితే ప్రశ్నాపత్రం లీకేజీతో మార్చి 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) (Assistant Engineer) పరీక్షలను (Exam) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థుల మేలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది.
కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జనార్ధన్ రెడ్డి (B Janardhan Reddy) నేతృత్వంలో సభ్యులు, కార్యదర్శితో సమావేశమయ్యారు. లీకేజీ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. ఈ క్రమంలో 833 సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈనెల 5వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. 55 వేల మంది పరీక్ష రాశారు. ఈనెల 11వ తేదీన ఏఈ పత్రం లీకైంది. అనంతరం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సొంత ఉద్యోగులు లీక్ కు పాల్పడడంతో కమిషన్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే లీకేజ్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (Special Investigation Team- SIT) విచారణ చేస్తోంది. పోలీసుల పని వారు చేస్తుండగా.. ఇక సంస్థాగతంగా కమిషన్ చర్యలు చేపట్టింది. అభ్యర్థులకు నష్టం జరగకుండా న్యాయ నిపుణుల సూచనతో లీకేజ్ వ్యహహారంలో ఏఈ పరీక్షను రద్దు చేయాలని కమిషన్ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు బుధవారం రాత్రి పరీక్ష రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. పోలీసుల నివేదిక ఆధారంగా కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేసు వ్యవహారంలో మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రధాన నిందితుడు ప్రవీణ్, రేణుకలను పోలీసులు ఇంకా విచారించాల్సి ఉంది. విచారణ కోసం నిందితులను కస్టడీకి పంపాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా ప్రవీణ్ దారుణాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. తవ్వినకొద్దీ అతడి లీలలు బయటకు వస్తున్నాయి. కమిషన్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అమ్మాయిల నంబర్లు సేకరించడం.. వారితో చనువుగా మాట్లాడి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలోనే అతడి ఫోన్ పరిశీలించగా. అతడి ఫోన్ లో యువతుల నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక ఇటువైపు ప్రవీణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నారు.