కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా ఇంకా ముందుందన్నారు. బుధవారం అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న అమిత్ షా కాంగ్రెస్ (Congress) ఇండియా కూటమిపై ఘాటు విమర్శలు చేశారు. కరప్షన్ కాంగ్రెస్ క్యారెక్టర్ (Character) అని దుయ్యబట్టారు. అవిశ్వాసం ఒక రాజ్యాంగ ప్రక్రియ అని దీనిపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అవిశ్వాసంతో కొన్నిసార్లు కూటముల బలమెంతో తెలుస్తుందన్నారు. ఒక ఎంపీ 13 సార్లు రీ లాంచ్ అయ్యారు.. 13 సార్లూ ఫెయిల్ అయ్యారంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ హయాంలో ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అన్నారు. 7 కీలకమైన రంగాల్లో మోడీ బలమైన పునాది వేశారని చెప్పారు.
పాక్ భూబాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ (Surgical strike) చేశామని.. తాము అధికారంలోకి వచ్చాక 4 వేల మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని, ఉపా చట్టం కింద 56 మందిని దోషులుగా ప్రకటించామన్నారు. మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ(Loan waiver)లపై మాకు నమ్మకం లేదని.. ఎవరూ లోన్ తీసుకోకూడదన్నదే మా ఉద్దేశం అన్నారు. రైతులకు రుణ మాఫీ కాదు రుణ భారం లేకుండా చేశామని, సాగుకు ఇబ్బంది పడకుండా రైతులకు సాయం అందిస్తున్నామన్నారు. జన్ ధన్ యోజన (Jan Dhan Yojana) తెచ్చినప్పుడు ఎగతాళి చేశారని, కరోనా వ్యాక్సీన్ వచ్చినప్పుడు కూడా మోదీ వ్యాక్సీన్ అని విమర్శలు చేశారని గుర్తు చేశారు. రైతుకు కావాల్సింది రుణమాఫీ కాదని, వారికి రుణభారం కావొద్దన్నారు. తాము ఉచితాలకు వ్యతిరేకమని, స్వయంసమృద్ధిపై దృష్టి సారించామన్నారు.