»Ap Minister Rojas Key Comments On Chiranjeevi What Did You Do During The Partition Time
Roja: చిరంజీవిపై ఏపీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు..విభజన టైంలో ఏం చేశారని నిలదీత
మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని అంటే ఊరుకునేది లేదన్నారు. తమ్ముడికి సలహాలు ఇచ్చి బాగుచేయాలన్నారు. సినిమా ఫంక్షన్లలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడ్డం మంచి పద్దతి కాదన్నారు.
ఏపీ సర్కార్‌పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిరూకు ఏపీ మంత్రి రోజా (Minister Roja) కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని రోజా గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు చిరంజీవి ఏం చేశారని రోజా ప్రశ్నించారు. హోదా గురించి చిరంజీవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారని, కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని నిలదీశారు.
ఏపీ(Andhrapradesh)లో గడప గడపకూ వచ్చి చూస్తే అభివృద్ధి ఏవిధంగా జరిగిందో తెలుస్తుందన్నారు. ఎన్ని రోడ్లు వేశామో చూసి మాట్లాడాలన్నారు. చిరంజీవి చెబితే విని పనిచేసే పరిస్థితి సీఎం జగన్‌కు లేదన్నారు. సినిమా వేదికలపై రాజకీయాలు ప్రస్తావించే పద్దతి ఏంటని చురకలంటించారు. చిరంజీవి సలహాలు ఇవ్వాలనుకుంటే తన తమ్ముడికి ఇవ్వాలని సూచించారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్(Congress)లో విలీనం చేసి చిరంజీవి లబ్ధి పొందారని, రాష్ట్రానికి మాత్రం ఏం చేయలేదన్నారు. సినిమావాళ్లు చెబితే వినే స్థాయిలో తమ ప్రభుత్వం లేదన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలని చిరంజీవికి సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు బురదచల్లే మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.