»The Volunteer Showed Geetham College Id When Asked For Id Card
Andhrapradesh: ఐడీ కార్డు అడిగితే గీతం కాలేజ్ ఐడీ చూపెట్టిన వాలంటీర్
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై మాటల యుద్ధం సాగుతోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు సీఎం జగన్ మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో వాలంటీర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజమో, కాదోనని మరికొందరు సందేహిస్తున్నారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. ఇప్పుడంతా వాలంటీర్ వ్యవస్థపైనే చర్చ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విరుచుకుపడుతుంటే దానికి ధీటుగా వైసీపీ నేతలు, వాలంటీర్లు పెదవి విరుస్తున్నారు. తాజాగా నేడు సీఎం జగన్ తిరుపతిలో వైఎస్ఆర్ నేస్తం పథకం కింద బటన్ నొక్కి నగదు వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ జనసేనాని పవన్‌పై, వాలంటీర్ వ్యవస్థను తప్పుబడుతున్న పలువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఓ వాలంటీర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతోన్న వీడియో:
ఐడీ కార్డు అడిగితే గీతం కాలేజ్ ఐడీ కార్డు చూపించిన వాలంటీర్
వాలంటీర్ పేరుతో ప్రజల నుండి డేటా ఎందుకు సేకరిస్తున్నారు, మీరు ప్రభుత్వ అధికారి అయితే మీ ఐడీ కార్డు చూపించమని అడిగిన వ్యక్తికి గీతం కాలేజ్ ఐడీ కార్డు చూపించిన వాలంటీర్. pic.twitter.com/NEmyXhezBB
ఏపీలో వాలంటీర్లు గత కొన్ని రోజుల నుంచి ప్రజల డేటాను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు హయాంలో కూడా డేటా సేకరణ జరిగింది. ఆ సమయంలో విపక్ష నేతగా ఉన్న జగన్ దానిని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దానిపై గట్టి హంగామానే జరిగింది. తీరా ఇప్పుడు వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా ప్రజల నుంచి అనేక వివరాలు సేకరిస్తున్నారు. దీనిని బట్టి అందులో వైసీపీ అభిమానులు ఎవరో, వ్యతిరేకులు ఎవరనే డేటాను కూడా వాలంటీర్లు సేకరిస్తున్నారని పలువురు ఫిర్యాదు కూడా చేశారు.
తాజాగా ఓ మహిళ వాలంటీర్ పేరుతో ప్రజల నుంచి డేటా సేకరించడానికి వెళ్లింది. అయితే ఆ అమ్మాయి అనేక వివరాలు అడిగే సరికి ఆ ఇంటి వ్యక్తి అనుమానించాడు. ప్రభుత్వ అధికారి అయితే ఐడీ కార్డు చూపించాలని కోరాడు. వాలంటీర్ అయితే ఐడీ కార్డు చూపించమని అడిగాడు. ఆ వ్యక్తికి అక్కుడున్న వాలంటీర్ గీతం కాలేజ్ ఐడీ కార్డు చూపించింది. దీంతో అక్కడున్న వ్యక్తి ఫైర్ అయ్యాడు. వాలంటీర్ ఐడీ కాకుండా గీతం కాలేజ్ ఐడీ కార్డు చూపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాలంటీర్ వ్యవస్థపై జగన్, పవన్ మాటల యుద్ధం మధ్య ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో చర్చనీయాంశమైంది.
సంక్షేమ పథకాల సమాచార సేకరణలో రాజకీయ పార్టీల అభిమానుల వివరాలు సేకరించడం ఎందుకు? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమేనని మరికొందరు సెలవిస్తున్నారు. ప్రస్తుతం వాలంటీర్ ఐడీ కార్డు వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా పలువురు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.