»Telangana Nagam Janardhan Reddy Ready To Contest In Nagarkurnool
ReEntry మళ్లీ రంగంలోకి నాగం.. కానీ ఈసారే చివరి పోరాటం
ఎవరెన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. గెలవబోతున్నా. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా గురించి ప్రజలకు బాగా తెలుసు. 15 ఏళ్లు వైద్యుడిగా.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. అలాంటి నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhan Reddy) మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలకు సిద్ధమవుతున్నాడు. రాజకీయంగా తప్పటడుగులు వేసిన నాగం తన రాజకీయ జీవితంలో చివరి సారి బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ ఎన్నిక (Telangana Assembly Elections)ల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ (Nagarkurnool) అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు. పోటీ చేయడమే కాకుండా గెలిచి తీరుతానని ప్రకటించాడు.
ఉమ్మడి పాలమూరు జిల్లా (Combined MahabubNagar District)లో చక్రం తిప్పిన నాయకుడు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో అగ్ర నాయకుడిగా వెలుగొందాడు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిని పరాభవం ఎదుర్కొన్నాడు. అనంతరం తెలంగాణ నగారా సామితి అని సొంత పార్టీ పెట్టి ఆ తర్వాత బీజేపీలో విలీనం చేశాడు. కొన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నా రాజకీయంగా అంతగా యాక్టీవ్ గా లేరు. టీడీపీలో కలిసి పని చేయడంతో రేవంత్ రెడ్డి సహాయంతో నాగర్ కర్నూల్ లో మరోసారి బరిలోకి దిగాలని నాగం చూస్తున్నాడు. అయితే 75 ఏళ్ల వయసులో ఈసారి చివరి పోటీ చేద్దామని భావిస్తున్నాడు. గెలిస్తే రాజకీయాల్లో కొనసాగడం.. ఓడితే ఇక్కడితో రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో నాగం జనార్ధన్ రెడ్డి ఉన్నాడు.
ఈ మేరకు శుక్రవారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాగర్ కర్నూల్ లో కాందరు సర్వేలు చేస్తూ ప్రజలను మోసం చేసేందుకు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. గెలవబోతున్నా. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా గురించి ప్రజలకు బాగా తెలుసు. 15 ఏళ్లు వైద్యుడిగా.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. అలాంటి నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటారు. ఈసారి ఎన్నికల్లో నా సత్తా చూస్తారు’ అని తెలిపారు. ‘2018 ఎన్నికల సమయంలో ఉయ్యాలవాడ సమీపంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ మోసపూరిత ప్రకటనలు ఇచ్చాడు. ప్రజలను తప్పుదోవ పట్టించి, మోసపు హామీలను ప్రకటించాడు. ఎన్నికల రోజున రైతు బంధు వేయడంతోనే నేను ఓటమి పాలయ్యా’ అని తన ఓటమికి కారణాలు నాగం జనార్ధర్ రెడ్డి తెలిపాడు. ఇక గ్యాస్ ధరల పెంపుపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రంలో దుచుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందని మండిపడ్డారు.
2018లో అసెంబ్లీకి పోటీ చేయగా.. అనంతరం మహబూబ్ నగర్ లోక్ సభ (Lok Sabha) నుంచి ఎన్నికల్లో పోటీ చేసినా నాగం జనార్ధన్ రెడ్డికి ఓటమి తప్పలేదు. తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి అప్పగించగా.. అతడు అంతగా విజయం సాధించలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరన జరిగే ఎన్నికల్లో చివరిసారిగా నాగం జనార్ధన్ రెడ్డి తన రాజకీయ పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. ప్రస్తుతం ఆయన అనుచరులు ఇతర పార్టీల్లో బిజీగా ఉండడంతో ఆయనకు కలిసి రావడం లేదు.