»Telangana Govt Anounced Rs 30 Lakhs One Gazetted Job To Preethi Family
Medico Preethi కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండ.. ఏమేమి హామీలంటే..?
వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) అండగా నిలబడింది. ఐదు రోజుల పాటు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రీతిని కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి మృత్యువుతో పోరాడలేక ప్రీతి కన్నుమూసింది. ర్యాగింగ్ ధాటికి ప్రాణం కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది.
సీనియర్ విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) అండగా నిలబడింది. ఐదు రోజుల పాటు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రీతిని కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి మృత్యువుతో పోరాడలేక ప్రీతి కన్నుమూసింది. ర్యాగింగ్ ధాటికి ప్రాణం కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. రూ.30 లక్షలు ఆర్థిక పరిహారం, కుటుంబంలోని ఒకరికి ఒక గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగం (Gazetted Officer) కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జనగామ జిల్లా (Jangaon District) కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెంది ప్రీతి (Preeti) కాకతీయ వైద్య కళాశాల (Kakatiay Medical College-KMC)లో చదువుతుండేది. అనస్థీషియా (Anesthesia) విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతిని వరంగల్ (Warangal) మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి (MGM)లో శిక్షణ తీసుకుంటుండగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడు. వాట్సప్ గ్రూపులో ఆమెను దూషిస్తూ పోస్టులు చేశాడు. వీటిపై వారిద్దరి మధ్య వివాదం జరిగింది. సైఫ్ వేధింపులు తీవ్ర చేయడంతో మనస్తాపానికి గురైన ప్రీతి ఈనెల 22వ తేదీన మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అపస్మారక స్థితికి చేరుకున్న ప్రీతిని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎమెర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో కుప్పకూలిపోవడంతో వెంటనే ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ (NIMS)కు తరలించారు. హెవీ డోస్ ఇంజెక్షన్లు తీసుకోవడంతో ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రీతిని బతికించేందుకు డాక్టర్ పద్మజా నేతృత్వంలోని ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం శ్రమించింది. ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి ఆమెకు వైద్యం అందించినా ప్రీతిని కాపాడుకోలేకపోయాం. ఆమె శనివారం రాత్రి 9 గంటల సమయంలో కన్నుమూయడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా ప్రీతి వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం ప్రకటించగా.. మంత్రి ఎర్రబెల్లి రూ.20 లక్షలు ప్రకటించారు. దీంతోపాటు కుటుంబంలో ఒకరికి గెజిటెడ్ ఉద్యోగం, అది కూడా పంచాయతీ రాజ్ శాఖలో ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఇక ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించారు. ఇక వేధింపులకు పాల్పడ్డ సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (SC, ST Atrocity Case) కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన వరంగల్ జిల్లా పోలీసులు తాజాగా సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నట్లు.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసులు చెబుతున్నారు. కాగా ప్రీతి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు రేవంత్ రెడ్డి, షర్మిల, బండి సంజయ్ సంతాపం ప్రకటించారు.