కిడ్నీలో (Kidney) రాళ్లు అంటే ఏ చిన్న పరిణామంలో ఉంటాయని అనుకుంటాం. ఉంటే రెండు, లేదా మూడు ఉంటాయి. కానీ ఏకంగా 154 రాళ్లు ఉండడం ఎప్పుడైనా మనం విన్నామా. కానీ ఓ వ్యక్తికి ఏకంగా 154 రాళ్లు ఉన్నాయి. మధుమేహంతో (Diabetes) బాధపడుతూ ఆస్పత్రికి రాగా.. కిడ్నీలో రాళ్లు చూసి వైద్యులు నివ్వెరపోయారు. అతి కష్టంగా ఆ రాళ్లను తొలగించారు. ఈ సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంది.
రామగుండం (Ramagundam) పట్టణానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం హైదరాబాద్ (Hyderabad) కంటోన్మెంట్ విక్రమ్ పురిలో ఉన్న ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (Asian Institute of Nephrology and Urology) ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు పరీక్షలు చేయగా ఒకే కిడ్నీలో ఏకంగా 6332 మిల్లీ మీటర్ల పెద్దరాయితో పాటు మరో 153 చిన్న చిన్న రాళ్లు (Stones) కూడా గుర్తించారు. అయితే వాటిని తొలగించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. చిన్న చిన్న రాళ్లను అయితే సులభంగా తొలగించవచ్చు. కానీ అతి పెద్ద రాయి ఉండడంతో వైద్యులు సమాలోచనలు చేశారు. అనంతరం ఎండోస్కోపింగ్ విధానంలో లేజర్ పద్ధతిలో రాళ్లను తొలగించారు. పెద్ద రాయిని ముక్కలుగా పగులగొట్టారు. అనంతరం ఒక్కో రాయిని శస్త్ర చికిత్స ద్వారా 154 రాళ్లను బయటకు తీశారు. ప్రస్తుతం బాధితుడు ఆరోగ్యంగా ఉన్నట్లు యూరాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర (Dr Raghavendra) తెలిపారు.
‘ఇలాంటి కేసులు చాలా అరుదుగా (Rare Case) కనిపిస్తుంటాయి. కిడ్నీల్లో ఇంత పెద్ద రాయి ఉండడం చాలా కొన్ని కేసుల్లో మాత్రమే చూసి ఉంటాం. పలు దశల్లో చికిత్స చేశాం. కిడ్నీలోని అన్ని రాళ్లను బయటకు తీశాం’ అని డాక్టర్ వివరించారు.