గతంలో టీఆర్ఎస్(trs) ని వీడి.. బీజేపీ(BJP)లో చేరిన కొందరు నేతలు… ఇప్పుడు మళ్ల సొంత గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న దాసోజు శ్రవణ్(dasoju sravan) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గులాబీ అధినేత కేసీఆర్ను కలిశారు. టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తిని తెలియజేశారు. శ్రవణ్ చేరికకు అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికాసేపట్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. మన్నెగూడలోని బీఎంఆర్ సార్ధా పంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
బీజేపీకి గుడ్ బై చెబుతూ దాసోజు శ్రవణ్ పార్టీ అధినేత బండి సంజయ్కు లేఖ రాశారు. లేఖలో అనేక విషయాలను ప్రస్తావించారు. అనేక ఆశలతో, ఆశయాలతో తాను బీజేపీలో చేరానని తెలిపారు. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు, దశ, దిశ లేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మక రాజకీయాలకు గానీ, తెలంగాణ సమాజానికి గానీ ఏ మాత్రం ఉపయోగకరంగా లేవని తక్కువ కాలంలోనే అర్ధమయిందని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా దాసోసు శ్రవణ్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ రాజకీయాలలో ఇమడలేక బీజేపీలో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు.
అదే విధంగా మరో నేత స్వామి గౌడ్(swamy goud) కూడా తిరిగి సొంత గూటికి చేరనున్నారు. ప్రస్తుతం స్వామి గౌడ్ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అక్కడ తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తనకు రాజకీయంగా ఎంతో తోడ్పడిన కేసీఆర్తో మళ్లీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. రేపు టీఆర్ఎస్లో చేరనున్నారు.