TDP Win: ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 2 స్థానాల్లో విజయం
ఏపీ(AP)లో అధికార వైఎస్సార్సీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ(TDP) అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు శుక్రవారం రెండో ప్రాధాన్యత లెక్కింపులో 94,510 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన టీడీపీ అభ్యర్థి.. కంచర్ల శ్రీకాంత్ కూడా వైసీపీ మీద ఘన విజయం సాధించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఊహించని ఫలితాలు వెలువడి.. అధికార పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి. తెలంగాణలో బీజేపీ(BJP) విజయం సాధించి.. BRSకు షాక్ ఇవ్వగా..అటు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 చోట్లా టీడీపీ(TDP) సత్తా చాటి.. వైసీపీకి(YSRCP) భారీ షాక్ ఇచ్చింది. ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(AP graduate MLC elections).. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించారు. ఆయనకి తొలుత మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో 50 శాతానికి పైగా ఓట్లు రాలేదు. దాంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా.. 94,510 మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో.. చిరంజీవి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నికల్లో గెలిచారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఇటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి.. కంచర్ల శ్రీకాంత్ కూడా వైసీపీ(YSRCP) మీద ఘన విజయం సాధించారు. ఇక్కడ కూడా మొదటి ప్రాధాన్యతా ఓట్లు లెక్కించినప్పుడు.. శ్రీకాంత్ 50 శాతానికి పైగా ఓట్లు సాధించేలేదు. దాంతో ఎన్నికల అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. వాటిల్లో శ్రీకాంత్.. భారీ మెజారిటీ సాధించడంతో.. ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది.ప్రతి రౌండ్ లోనూ టీడీపీ, వైసీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. రాత్రి 9 గంటలకు 8 రౌండ్ల లెక్కింపు పూర్తైంది. మొత్తం 2,45,576 ఓట్లు పోల్ అవ్వగా… 1,92,018 ఓట్లను లెక్కించారు. ఇందులో 15,104 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మిగతా 1లక్ష 76 వేల 914 ఓట్లలో వైసీపీ మద్దతిచ్చిన వెన్నపూస రవీంద్రారెడ్డికి… 74వేల678.. టీడీపీ బలపరిచిన అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాల్ రెడ్డికి.. 73వేల229, పీడీఎఫ్ నేత పోతుల నాగరాజుకు 15వేల254 ఓట్లు వచ్చాయి. రెండు చోట్ల టీడీపీ గెలవడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.