ఆంధ్ర ప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate MLC elections) అధికార వైసీపీకి (ycp government) భారీ షాక్ తగిలింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ( Telugu Desam) గ్రాడ్యుయేట్లు ఘన విజయం సాధించారు. ఈ గెలుపు పైన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘ఇంక మిగిలింది.. వై నాట్ పులివెందుల.. తిరుగులేని తీర్పు ఇచ్చిన పట్టభద్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగానికి రాజారెడ్డి రాజ్యాంగం తలవంచుందని, వారి అరాచకస్వామ్యంపై అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అని తేలిందని పేర్కొన్నారు. ఇది జగన్ ఓటమి-జనం గెలుపు అని అభిప్రాయపడ్డారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్న పులివెందుల పూల అంగళ్ల వద్ద నీ గెలుపు నినాదం మారుమోగిందంటూ గెలిచిన టిడిపి అభ్యర్థిని అభినందించారు.
600 కిలో మీటర్లు పూర్తి
నిన్న యువ గళం పాదయాత్ర 47వ రోజు కదిరి నియోజకవర్గం చిన్నపల్లోలపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభించారు లోకేష్. పాదయాత్ర 600 కి.మీ చేరుకున్న సందర్భంగా టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు హామీ ఇచ్చి చిన్నయల్లంపల్లి వద్ద మైలురాయిని ఆవిష్కరించారు. ఉత్సాహంతో సాగుతున్న యువ గళంకు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు మరింత ఆనందాన్ని ఇచ్చింది. అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని, ఇది తనలో నూతనోత్తేజం నింపిందని లోకేష్ అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తుందని, అందరికి అండగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నారు.