TSPSC Paper Leak: TSPSC లీకేజీలో కీలక మలుపు, రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసు సోమవారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఈ లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాఫ్తు చేస్తోంది. లీకేజీ పైన ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు అందిస్తోంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసు సోమవారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఈ లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాఫ్తు చేస్తోంది. లీకేజీ పైన ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు అందిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని అందులో పేర్కొన్నది సిట్. ఆయన తన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పిస్తే ఆ దిశగా దర్యాఫ్తు చేస్తామని ఏసీపీ స్థాయి అధికారి ఈ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్, ఈ కేసుకు సంబంధించి సంచలన ఆరోపణలు చేసిన మిగతా రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే యోచనలో ఉంది.
నోటీసులు అందలేదు
తనకు సిట్ నుండి ఎలాంటి నోటీసులు అందలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాంటప్పుడు నోటీసుల్లో ఏం ఉందో కూడా తనకు తెలియదన్నారు. నోటీసులు తనకు అందిన తర్వాత ఏమైనా స్పందించగలనని చెప్పారు.
ప్రశ్నాపత్రాల లీకేజీపై రేవంత్ ఏమన్నారు…
TSPSC పేపర్ లీకేజీకి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ స్కాంకు పొలిటికల్ లింక్స్ ఉన్నాయని ఆరోపించారు. ఒకే ఊళ్లో వంద మందికి పేపర్ లీక్ చేశారన్నారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని ప్రశ్నాపత్రాల లీకేజీలో ఉందని ఆరోపించారు. తిరుపతి షాడో మంత్రి అన్నారు. ఆయన ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసారు. ఒకే ఊరిలో వందమందికి పేపర్ లీక్ చేశాడన్నారు. TSPSCలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి కీలక బాధ్యతలు అప్పగించడంలో అసలు రహస్యం దాగి ఉందన్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న ప్రవీణ్, రాజశేఖర రెడ్డిలు నోరు విప్పితే పెద్ద తలకాయల పేర్లు వెలుగు చూస్తాయన్నారు. కానీ పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తే వాళ్లను ఎన్ కౌంటర్ చేస్తామని జైల్లో బెదిరించారన్నారు. ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీటీవీ ఫుటేజీని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసులోని ఏ2 రాజశేఖర రెడ్డికి ఉద్యోగం ఇప్పించింది కేటీఆర్ పీఏనే అన్నారు. వీరిద్దరి స్నేహితులు అని, ఒకే ప్రాంతమని చెప్పారు. ఆ పరిచయంతోనే 2017లో రాజశేఖర రెడ్డికి ఉద్యోగం ఇప్పించారన్నారు. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చి, TSPSCకి బదలీ అయ్యారన్నారు. సిట్ అధికారి కూడా కేటీఆర్ బావమరిదికి దోస్త్ అని, ఆయనకు ఈ కేసును అప్పగించడం ఎందుకో చెప్పాలని నిలదీశారు రేవంత్. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. లీకేజీ వ్యవహారంపై తాము గవర్నర్ ను కలుస్తామని చెప్పారు.