కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో యాత్ర కొనసాగుతోంది. అయితే శుక్రవారం అకస్మాత్తుగా పాదయాత్రకు బ్రేక్ పడింది. భద్రతా వైఫల్యంతో రాహుల్ తన యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో స్థానిక యంత్రాంగం భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. ప్రజలను నియంత్రించడంలో విఫలమవుతున్నారని గుర్తించి యాత్రకు విరామం ఇచ్చారు.
ఈ విషయాన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా సూచించడంతో రాహుల్ తన యాత్రను విరమించుకున్నారు. కశ్మీర్ లోయకు ప్రవేశ ద్వారంగా ఉన్న ఖాజీగుండ్ సమీపంలో యాత్రను నిలిపివేసినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ‘బనిహాల్ టన్నెల్ దాటి ఖాజీగుండ్ కు చేరుకున్న రాహుల్ దక్షిణ కశ్మీర్ లోని వెస్సు వైపు యాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో బాహ్య భద్రతా వలయాన్ని నిర్వహించాల్సిన స్థానిక పోలీసులు అకస్మాత్తుగా మాయమయ్యారు. భారీ జన సమూహాలను నియత్రించడంలో లోపాలు ఉన్నాయని గుర్తించాం. దీంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది రాహుల్ ను యాత్ర చేపట్టేందుకు అనుమతించలేదు. దీంతో యాత్రకు విరామం ప్రకటించి నైట్ హాల్ట్ వేదికకు చేరుకున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు మొదలయ్యాయి. ఉద్దేశపూర్వకంగా కేంద్రం రాహుల్ కు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. భద్రతా వైఫల్యం లోపించకుండా స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించింది. యాత్ర సాఫీగా జరిగేందుకు స్థానిక యంత్రాంగంతో రాహుల్ భద్రతా సిబ్బంది చర్చలు చేస్తోందని జై రామ్ రమేశ్ తెలిపారు. యాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా కశ్మీర్ లోకి ప్రవేశించగానే రాహుల్ యాత్రకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. కొన్ని రోజుల కిందట రాహుల్ యాత్ర సమీపంలో బాంబు దాడులు జరిగాయి. దీంతో రాహుల్ యాత్రకు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.