»Revanth Reddy Fire On Kcr One Lakh Land Scam In Telangana
Revanth reddy: ల్యాండ్ స్కాంతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు..మహారాష్ట్రకు పోయి
తెలంగాణలో వర్షాల కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం కేసీఆర్(KCR) మాత్రం మహారాష్ట్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యానించారు. మరోవైపు కేసీఆర్ రాష్ట్రంలో వేల ఎకరాలు భూకబ్జా చేసి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. ఇలాంటి దోపిడీ నేతలకు ప్రజలు బుద్ది చెప్పాలని రేవంత్ అన్నారు.
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి(revanth reddy) అన్నారు. తాను 20 ఏళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ శాసనసభ్యులు బిరుదు రాజమల్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో రేవంత్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు ఉంటుందన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ప్రత్యేక విమానంలో బిఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యేందుకు మహారాష్ట్రకు వెళ్లారని ఎద్దేవా చేశారు. పేదలకు ఆర్థిక సహాయం అందించడంలో విఫలమైన బిఆర్ఎస్కు ఓటు వేసే ముందు ప్రజలు మరోసారి ఆలోచించాలని కోరారు. వర్షాలకు ఇబ్బందులు పడిన ప్రజలకు వరద సాయం అందించడంలో కూడా కేసీఆర్(KCR) విఫలమయ్యారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ సీతక్క, శ్రీధర్ బాబు తదితరులు వరద(floods) సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ అలువాక రాజయ్య, సులతానాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదు సమేత రాధాకృష్ణ, సింగిల్ విండో చైర్మన్ వామన్ రావు, ఎంపీటీసీలు మహేందర్, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రామస్వామి, రంగాపూర్ సర్పంచ్ జి.రమేష్ సహా తదితరులు ఉన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ తెలంగాణలో 10 వేల ఎకరాలు భూకబ్జా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీని ద్వారా దాదాపు లక్ష కోట్లు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. సీఎం(CM) భూ కుంభకోణాలను త్వరలోనే బయటపెడతానన్నారు. అసలు హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్స్, కుర్ర శ్రీనివాస్ తదితరులకు వేల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.