అదానీ ఎదుగుదలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని, ఆయన కోసం నిబంధనలు కూడా మార్చారని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అదానీ వ్యవహారం గత కొద్దిరోజులుగా హాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ అంశంపై సభలో మాట్లాడారు. మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే తక్కువకాలంలో ప్రపంచ కుబేరుడయ్యాడని ఆరోపించాడు. దీనిపై బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేత ఆరోపణలు సరికాదన్నారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ నిరాధారమన్నారు. ప్రధానమంత్రి పైన, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం పైన ప్రజలకు అపార విశ్వాసం ఉందన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలు చూస్తే ఆయనకు ఉన్న ఇంటెలిజెన్స్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. తొలిసారి పార్లమెంటులో మాట్లాడిన రాష్ట్రపతి ప్రసంగంపై ఆయనకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. ఆయన ఆరోపణలను ప్రొసీడింగ్స్ నుండి తొలగించడమైనదని, ఎందుకంటే ఆధారాలు లేవన్నారు.
మోడీపై చేసిన ఆరోపణలు రుజువు చేయగలిగే ఆధారాలు కానీ, డాక్యుమెంట్లు ఉంటే వాటిని సభకు సమర్పిస్తే బాగుండేదన్నారు. సభలో మాట్లాడింది రాహుల్ కాదని, అసహనమే ఆయనలో కనిపించదన్నారు. ప్రధాని పైన లేదా ప్రభుత్వంపైన తీవ్రమైన ఆరోపణలు చేసేటప్పుడు తగిన పరిశోధన, హోం వర్క్ ఉంటే బాగుంటుందని హితవు పలికారు. రాజస్థాన్‌లో మెగాప్రాజెక్టుల కోసం సేకరించిన భూమి గురించి తన బావను రాహుల్ అడిగి ఉండవచ్చునని, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఆయన పార్టీ పాలనలోనే ఉందని, అదానీ, ఆయన గ్రూప్‌కు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన భూములపై సొంత పార్టీ నేతను రాహుల్ ప్రశ్నించి ఉండవచ్చునని వ్యాఖ్యానించారు.