ఎవరి తల రాత ఎలా మారుతుందో ఎప్పటికీ తెలియదు. ఒకప్పుడు ఏమీ లేనివాడు ఇప్పుడు కోటీశ్వరుడు అవుతాడు. ఒకప్పుడు మోసం చేసిన వాళ్లు ఇప్పుడు దగ్గర కావచ్చు. అందువల్ల అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవనేది గుర్తుంచుకోవాలి. సామాన్యుల విషయంలోనే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకప్పుడు చిన్న హీరోల సరసన చేయని స్టార్ హీరోయిన్ ఇప్పుడు వారి పక్కన కూడా చేసేందుకు ఒకే అంటోంది. ఇప్పుడు పూజా హెగ్డే(Pooja Hegde) పరిస్థితి అలానే ఉంది.
బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) చేతిలో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవు. చేతిలో ఉన్న గుంటూరు కారం కాస్తా చేజారిపోయింది. దీంతో ఇక ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మళ్లీ ఛాన్సులు రావడం కష్టమే అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు బ్రేక్ ఇవ్వడానికి మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) బయలుదేరారు. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇటీవల ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఆ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇటీవల ఆమెను సంప్రదించారట. ఇప్పటి వరకు రవితేజ, పూజా హెగ్డే కలిసి సినిమా చేయలేదు. అందువల్ల వాళ్ళ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. పైగా, పూజా హెగ్డే ఉంటే నార్త్ ఇండియా మార్కెట్, హిందీ శాటిలైట్ అండ్ ఓటీటీకి కూడా హెల్ప్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. మరి పూజ ఒకే చెబుతుందా లేదా అనేది తెలియాలి.